Saturday, April 5, 2025

మూల స్వభావ స్వేచ్ఛపై దాడి

పదేండ్లలో తెలంగాణ విధ్వంసం
ఇప్పుడున్నది ప్రజల ప్రభుత్వం
సోనియాకు, తెలంగాణకు పేగుబంధం
త్వరలోనే పేదలకు 4.50 లక్షల ఇండ్లు
ఉద్యోగాల కల్పనలో నిక్కచ్చిగా ఉన్నాం
ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్​ రెడ్డి

పదేండ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది భౌతిక విధ్వసం మాత్రమే కాదని, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగిందని విమర్శించారు. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని, ప్రజలందరికీ చెందాల్సినరాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయని, ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదని అన్నారు. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉందని, ఈ ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం అని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు.

ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగాయి. ఉదయం గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. “నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ లకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు.

సోనియాకు తెలంగాణకు పేగుబంధం
ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని కొందరు తప్పుబడుతున్నారని, బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి ఆహ్వానించడం కోసం బిడ్డకు అనుమతి కావాలా? ఏ హోదాలో ఏ పదవిలో ఉన్నారని మహాత్మాగాంధీని జాతి పితగా గుర్తుంచుకున్నామని, తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు ఈ సమాజం సోనియాను గుర్తుంచుకుంటుందని, తెలంగాణతో సోనియా గాంధీది పేగు బంధం అని, రాజకీయ బంధం కాదు అని అన్నారు.

ఇదే జాతీయ గీతం
తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదని సీఎం రేవంత్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఉంచాలని నిర్ణయించామని, అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించి ఆ గీతాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నామని తెలిపారు. తెలంగాణ చిహ్నం జాతి చరిత్రకు అద్దం పట్టేదని, జాతి చరిత్ర అందులోనే ప్రతిబింబిస్తుందని, తెలంగాణ అంటేనే ధిక్కారం, పోరాటం అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నంలో ధిక్కారం, పోరాటం ప్రతిబింబించాలన్నారు. అందుకే ఆ సూచనలకు అనుగుణంగా కొత్త చిహ్నం రూపొందిస్తున్నామని, ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్ ను టీజీగా మార్పు చేశామని, సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లిగా ఉండాలని, తెలంగాణ తల్లి అంటే కష్టజీవి, కరుణామూర్తి అని, వీటితో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవం పోస్తాం అని సీఎం అన్నారు.

గ్రూప్ – 1 నోటిఫికేషన్
ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడం కోసమే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని తెలిపారు. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ నెల 9న ప్రిలిమినరీ పరీక్ష జరగబోతోందన్నారు. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చామని, వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచామని, ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు.

పేదలకు 4,50,000 ఇళ్లు
రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మొదలుపెట్టామని సీఎం వెల్లడించారు. ఈ ఒక్క ఏడాదిలోనే రూ. 22,500 కోట్లు కేటాయించామని, త్వరలో పేదల కోసం 4,50,000 ఇళ్లు కట్టించబోతున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని, ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

బానిసత్వాన్ని భరించం
భానిసత్వాన్ని తెలంగాణ భరించదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం అని, ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించమని, దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉందన్నారు. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదని, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం అని సీఎం తెలిపారు.

“ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్ధలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి.. ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్ ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చి… ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సచివాలయంలోకి ఈ రోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరాపార్కులో ధర్నచౌక్‌కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛను ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవు. అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నాం” అని సీఎం రేవంత్ అన్నారు.

చరిత్రకు పునర్జీవం
ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్థిత్వం, ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని సీఎం చెప్పారు. బోనం నుండి బతుకమ్మ వరకు, సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి అని, సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు… భద్రాద్రి రాముడు నుండి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉందని, ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి అని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర సంపద పెంచి, పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. కఠినమైన ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామని, స్వల్పకాలిక ఆలోచనలు కాదు… దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నామని చెప్పారు.

రుణమాఫీ చేస్తాం
రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం తమదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని, ఆ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోందని, రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చామని, ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచామని, ఎలాంటి షరతులు లేకుండా తడిచిన ధాన్యం కొంటున్నామన్నారు. తరుగు పేరుతో రైతును దోపిడీ చేసే విధానాన్ని అరికట్టామని, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, ధరణి పై స్పెషల్ డ్రైవ్ తో సమస్యలు పరిష్కరిస్తున్నాం అని రేవంత్ రెడ్డి వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com