ఢిల్లీకి చేరిన పంచాయతీ
హక్కుల కమిషన్ ముందు బాధితులు
అర్ధరాత్రి వేళ పోలీసుల దాడి
ఇంట్లోకి వచ్చి మహిళలపై దాష్టీకం
అక్రమ అరెస్టులపై వివరించిన బాధితులు
తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్నాం
అయినా రాష్ట్ర ప్రభత్వం పట్టించుకోలేదు
సీఎం రేవంత్‌ని కలిసేందుకు వెళ్తే బెదిరించారు
ఎన్హెచ్ఆర్సీకి లగచర్ల గ్రామస్తుల ఫిర్యాదు
బాధితులకు అండగా వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లు
తమ భూములను వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డిని లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఉన్న భూమి మొత్తం తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని.. పోలీసులు ఎప్పుడు వచ్చి ఏం చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు సృష్టించిన అరాచకంపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తొమ్మిది నెలలుగా ధర్నాలు చేస్తున్నాం..
మా భూములు ఇచ్చేది లేదంటూ గత 9 నెలలుగా చాలా ధర్నాలు చేస్తున్నామి లగచర్ల బాధితులు తెలిపారు. మేము ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదు.. కానీ మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీసు సెక్యురిటీ లేకుండా వచ్చారని పేర్కొన్నారు. దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారని చెప్పారు. ఆ దాడిని సాకుగా చూపి అర్ధరాత్రి500 మంది పోలీసులు వచ్చి, కరెంట్ బంద్ చేసి తమపై దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుతిక పిసికి, కళ్లకు బట్టలు కట్టి, ఇష్టానుసారం బూతులు తిడుతూ కొట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మగవాళ్లందరనీ అరెస్ట్ చేశారని.. మిగిలిన మగవాళ్లు ఊరు వదిలి పారిపోయారని తెలిపారు.
మా భూములు ఇవ్వబోము..
మా భూములు ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వమని లగచర్ల బాధితులు స్పష్టం చేశారు. తమ భూములను వదిలేయాలని.. తమ వారిని వదిలేయాలని కోరారు. తమకు ఉన్న మొత్తం భూమిని తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారోనని.. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని చెప్పారు. తమ ఇంట్లో ఉన్న మగవాళ్లందరినీ తీసుకెళ్లారని.. ఎనిమిది రోజులుగా తమ పిల్లలు ఎక్కడున్నారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు మేము చాలా బాగా బతికామని.. గత 9 నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. తమ ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే తమను బెదిరించి పంపించారని చెప్పారు.
తెలియకుండా దాడి చేశాం
తెలియకుండా జరిగిన దాడిని చూపించి అర్థరాత్రి 500 మంది పోలీసులు తమ ఇళ్లపైకి దౌర్జన్యానికి వచ్చారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కరెంట్ తీసేసి ఇంట్లోకి వచ్చి కొట్టారని బూతులు తిట్టారని తెలిపారు. అదే రోజు చాలా మంది మగవాళ్లను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు చేస్తున్న దౌర్జన్యానికి భయపడి చాలా మంది ఊరి వదిలి పారిపోయారని వివరించారు.
సురేష్‌పై లుక్ అవుట్ నోటీసు
లగచర్ల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల దాడి ఘటన కేసు మరింత తీవ్రం అవుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏ 1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ 2గా ఉన్న సురేష్ మాత్రం ఇంత వరకు ఆచూకీ లేదు. అందుకే అతని వెతికి పట్టుకునేందుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నప్పటికీ ఇంత వరకు సురేష్ ఆచూకీ లభించకపోవడంపై పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కలే ఆయన్ని దాచి పెట్టి ఉన్నారని ఫోన్ సిగ్నల్‌కి కూడా దొరకడం లేదని అంటున్నారు. అందుకే ఈ వ్యక్తిని పట్టుకోవడం మంరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇవాళ లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
ఏం జరిగిందో చెప్పండి
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామానికి జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ సోమవారం విచారణ కోసం చేరుకున్నారు. మధ్యాహ్నం లగచర్ల గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. దాడి రోజు ఏం జరిగిందని వివరాలు సేకరించారు. లగచర్ల గ్రామంలో గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు, గ్రామస్తులతో మాట్లాడారు. అక్కడి నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్లి రిమాండ్‌లో ఉన్న లగచర్ల గ్రామస్తులను కలిశారు. అక్కడ గంట పాటు లగచర్ల నిందితులతో మాట్లాడారు.
లగచర్లలో కలెక్టర్‌పై దాడి
ఫార్మాసిటీ కోసం లగచర్లతో పాటు మొత్తం మూడు గ్రామాల్లో ప్రభుత్వం భూ సేకరణ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి చేశారు. రైతులు దాడి చేశారని కేసు నమోదైంది. లగచర్ల లడాయిపై ఓవైపు కేసుల టెన్షన్.. మరోవైపు పొలిటికల్ అటెన్షన్ ఎక్కువైంది.అసలు దాడి చేసింది గ్రామస్తులేనా..? ఎంక్వయిరీలో ఏం తేలింది..? సీఎం రియాక్షన్ తర్వాత.. అధికారుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి..? అనేది హాట్ టాపిక్ గా మారింది.ఇదే తరుణంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ దాడి ఘటనలో బీఆర్ ఎస్ నేతలకు లింకులు బయటపడటంతో.. ప్రభుత్వం సీరియస్ యాక్షన్‌కు దిగింది. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ సహా అధికారులపై దాడికి ప్లాన్ చేసిందెవరు..? అధికార బృందాన్ని తప్పుదారి పట్టించిందెవరు..? ఇప్పుడీ ప్రశ్నల చుట్టే పోలీస్ ఎంక్వైరీ సాగుతోంది. అయితే కలెక్టర్‌పై దాడి కచ్చితంగా కుట్రేనని, అంతా ప్రీప్లాన్డ్‌గానే జరిగిందని హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకేసులో మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయంటున్న పోలీసులు.. కీలక సూత్రధారి భోగమోని సురేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇప్పటికే 25 మందిని కోర్టులో హాజరుపరిచారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి… ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేటీఆర్ పేరు
లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రమేయముందని పోలీసులు తేల్చారు. ఘటనకు ముందు.. ఆ తర్వాత కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. న్యాయనిపుణుల సలహాతో.. ఈ కేసులో కేటీఆర్‌ను కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నరేందర్‌రెడ్డి ఐఫోన్-14ప్రోను సీజ్ చేశామని చెబుతున్న పోలీసులు.. ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత లగచర్ల కేసులో ఇంకా ఎవరెవరున్నారనేది తేలుతుందంటున్నారు. తొలుత ఈ దాడి వెనక ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేశ్‌రాజ్ అని పేర్కొన్న పోలీసులు.. అనూహ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ఏ-1గా చూపించారు. సురేశ్ వెనక ఉంటూ.. కేటీఆర్ ఆదేశాలతో దాడికి కుట్ర చేసింది, కథ నడిపించింది నరేందర్‌రెడ్డి అని స్పష్టం చేశారు.