Wednesday, December 25, 2024

విచారణకు అల్లు అర్జున్‌

సంధ్య థియేటర్‌ ఘటనపై ప్రశ్నిస్తున్న పోలీసులు

సినీ నటుడు అల్లు అర్జున్​ విచారణ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్​లో కొనసాగుతోంది. ఈ నెల 4న సంధ్య థియేటర్​లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు రావాలంటూ సోమవారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​కు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అల్లు అర్జున్​ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ విచారిస్తున్నారు.
కాగా, పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో చర్చించారు. ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు 10 నిమిషాల వీడియో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టారు. దీనిపై కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పీఎస్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తండ్రి, మామ, లీగల్‌ టీంతో కలిసి విచారణకు..!
మంగళవారం ఉదయం 11.30 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్, లాయర్ వెళ్లారు. విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తారని లాయర్ అశోక్ తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలు చెబుతారని, ఇందులో ఏ ఇబ్బంది లేదన్నారు. లాయర్ సమక్షంలో విచారణ జరగనుంది.

చిక్కడపల్లి పీఎస్ వద్ద భద్రత కట్టుదిట్టం
అల్లు అర్జున్ విచారణకు హాజరవుతున్న సందర్భంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసి, పీఎస్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అల్లు అర్జున్, పోలీసుల పరస్పర ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా పోలీసులు చేసిన వ్యాఖ్యల్ని అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. తనను వ్యక్తిగతంగా దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తాను రోడ్ షో చేయలేదని, ర్యాలీ కూడా చేయలేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వడం వల్లే తాను సినిమాకు వెళ్లానని, లేని పక్షంలో వాళ్లు తనను వెనక్కి పంపే వారని చెప్పారు. మరో ఆరోపణ ఏంటంటే.. తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయారు, ఆమె కొడుకు కొన ఊపిరితో ఉన్నాడని చిక్కడపల్లి ఏసీపీ చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదు. పరిస్థితి మరింత ముదరడంతో డీసీపీ వెళ్లి హెచ్చరించిన తరువాతే అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. సినిమా చూశాకే వెళ్లిపోతానని చెప్పిన అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని చెప్పడంతోనే బయటక వెళ్లిపోయారని సీపీ తెలిపారు. థియేటర్ నుంచి వెళ్లిపోతూ సైతం కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు.
కాగా, తొక్కిసలాట ఘటన వైరల్ కావడం, బాధితులకు న్యాయం జరగలేదని ప్రభుత్వం భావించి చర్యలు చేపట్టింది. మరోవైపు రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు నటుడు అల్లు అర్జున్ పై మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. నటుడ్ని ఏ11గా చేర్చిన పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com