లగచర్ల బాధితుల వద్దకు నో పర్మిషన్
మహిళా సంఘాల జేఏసీని అడ్డుకున్న పోలీసులు
వాగ్వాదంలో మహిళలపై దాడి
దుస్తులు చింపేసిన పోలీసులు
లగచర్ల వివాదానికి రోజుకో చోట నిప్పు అంటుకుంటూనే ఉన్నది. బాధితులను పరామర్శించేందుకు మహిళా సంఘాల జేఏసీ నేతలు మంగళవారం ప్రయత్నించారు. వారిని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య, పద్మజా షా, ఝాన్సీ, అనసూయ, సజయ, సిస్టర్ లిస్సి, గీత సహా మహిళా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్సీ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో మాట్లాడినప్పటికీ లగచర్ల వెళ్లేందుకు అనుమతించలేదు. లగచర్లలో జరిగిన సంఘటనకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తుంటే మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం చేశారని ఈ సందర్భంగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. లగచర్లలో జరిగిన సంఘటనలను ప్రపంచానికి తెలియజేయాలంటూ బాధితుల నుంచి ఫోన్లు వచ్చాయని, అందుకే వెళ్తున్నామని మహిళా సంఘాల నేతలు వెల్లడించారు. తమతో పాటు పోలీసులను కూడా రావాలని కోరామని, అయినప్పటికీ మమ్మల్ని అనుమతించటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా కూడా లేకుండా వెళ్తామని హామీ ఇచ్చామని, అయినా పోలీసులు అంగీకరించలేదన్నారు. దీంతో మహిళా సంఘాల జేఏసీ నేతలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా..పెనులాగటలో మహిళా నేతల దుస్తులు చిరిగిపోయాయి.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేందుకు వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని, లగచర్లలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెెళ్తుంటే ఆపాల్సిన అవసరమేముందంటూ నిలదీశారు. నిజంగా పోలీసులు మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడకపోతే మమ్మల్ని ఎందుకు అనుమతించటం లేదంటూ ప్రశ్నించారు.