సిఎంఓ ఆదేశాలతో రంగంలోకి ఎస్‌బి, ఇంటెలిజెన్స్ అధికారులు
త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్
సచివాలయంలోని ఓ విభాగానికి చెందిన డిప్యూటీ సెక్రటరీ (హెచ్‌ఆర్‌ఎం 4లోని పిఆర్‌సికి సంబంధించి విధులు నిర్వర్తించే అధికారి) అవినీతిపై ఎస్‌బి (స్పెషల్‌బ్రాంచీ), ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన గతంలో చేసిన అవినీతి గురించి ఈ రెండు శాఖలకు చెందిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. గతంలో వివిధ శాఖల్లోని నాన్ గెజిటెడ్ పోస్టులను గెజిటెడ్‌గా మార్చిన విషయంలో ఆయన హస్తం ఉందన్న విషయాన్ని కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు సిఎస్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన పాత్రపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే సిఎంఓ నుంచి ఆ అధికారి అవినీతిపై విచారణ చేయాలని ఆదేశాలు రావడంతో ఇప్పటివరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చూసిన విభాగాలకు సంబంధించి ఫైళ్లపై ఎస్‌బి, ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
గతంలోనూ ఈ అధికారిపై సిఎంఓకు ఫిర్యాదు
గతంలోనూ ఈ అధికారిపై సిఎంఓకు కొందరు సచివాలయానికి చెందిన ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు ఆయన అనుచరులపైన జనవరిలో సిఎంఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలా ఆ డిప్యూటీ సెక్రటరీ లీలలు అవినీతికి సంబంధించి చాలా ఉన్నాయని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 20 మందికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆ అధికారి వేరే వాళ్ల ద్వారా డబ్బులను వసూలు చేశారని ఆరోపిస్తూ ఈ సంవత్సరం జనవరి 3వ తేదీన సచివాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు సిఎంకు ఫిర్యాదు చేయడం విశేషం. ఆ అధికారిని నమ్మి తాము డబ్బులు చెల్లించామని ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోగా ఉద్యోగాలు ఇప్పించలేదని ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. వివిధ శాఖల్లోని నాన్ గెజిటెడ్ పోస్టులను గెజిటెడ్‌గా మార్చిన సంఘటనలోనూ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల విషయంలోనూ ఆయన పాత్రపై ఎస్‌బితో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తుండడం విశేషం. ఇరు శాఖల అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని తెలిసింది.