సిఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క, ఎంపి కడియం కావ్య,
ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు
రాష్ట్రంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఆయన ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్‌కు ఆయన మనవడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. సోదరి సీతక్కతో తన అనుబంధం రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిదని సిఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానని సిఎం అన్నారు. ఆడబిడ్డలకు రక్షా బంధన్ శుభాకాంక్షలను సిఎం రేవంత్ తెలియజేశారు. వరంగల్ ఎంపి కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్‌లు బండ్రు శోభారాణి, మహిళా చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, కాల్వ సుజాతలు ముఖ్యమంత్రి రేవంత్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రాఖీ సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ సైతం రాఖీ కట్టడం విశేషం.
భట్టి విక్రమార్కకు రాఖీ కట్టిన సోదరీమణులు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన అక్కాచెల్లెల్లు రాఖీ కట్టి ఆశీర్వదించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరీమణులతో కలిసి ఘనంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్‌కు ఆయన స్వగృహంలో ఆయన సోదరి లీలా రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధం, ఆత్మీయ అనురాగలకు మారు పేరు రాఖీ పండుగ అని ప్రభుత్వ విప్ అన్నారు.
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖి కట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పలువురు కార్పొరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ముస్లిం మహిళలతో పాటు, నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రాఖీ కట్టారు. రక్షాబంధన్ పురస్కరించుకొని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు పలువురు మహిళలు రాఖీలు కట్టడం విశేషం.