-
నాలుగు కోట్ల జనం ఆశలు…. ఆకాంక్షలతో 100 రోజుల పాలన పూర్తి
-
రాష్ట్రంలో పరుగులు తీస్తున్న సంక్షేమం, అభివృద్ధి
-
తెలంగాణలో వెల్లివిరిసిన స్వేచ్ఛా, స్వాతంత్య్రం
-
నేటితో సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి 100 రోజులు
నాలుగు కోట్ల జనం ఆశలు, ఆకాంక్షలతో కొలువు దీరిన ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి (మార్చి 15వ తేదీ నాటికి) వంద రోజులు పూర్తయ్యింది. ఈ వందరోజుల్లో తెలంగాణలో అసలైన స్వేచ్ఛా స్వాతంత్య్ర వాతావరణం వెల్లివిరిసిందని, ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైందని రాజకీయ విశ్లేషకులు కితాబునిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఏ.రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు నిరం తరం 18 గంటల పాటు పనిచేస్తూ ప్రజలతో మమేకమై వారి కష్ట, సుఖాల్లో తోడునీడగా నిలుస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలు కష్టమేనన్న విమర్శలను కాంగ్రెస్ వంద రోజుల పాలన రుజువు చేసింది. ఆరు నూరైనా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా నిరంతరం ఆయన కృషి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలు ప్రశంసించడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల ముందు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల్లో ఇప్పటికే 5 ప్రారంభం కాగా, మరిన్ని పథకాలు అమలుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందించడం విశేషం.
మొదటి వంద రోజుల్లోనే అయిదు గ్యారంటీలు….
తొలి రోజున ప్రగతిభవన్ ముందున్న కంచెను తొలగించి మహాత్మగాంధీ జ్యోతిభా ఫూలే వేదికగా ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి వారంలో రెండు రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా ఇప్పటికే అయిదు పథకాలకు ప్రారంభించుకుంది. విధ్వంసానికి గురైన వ్యవస్థలను ఒక్కోక్కటిగా చక్కదిద్దుతూనే మొదటి వంద రోజుల్లోనే అయిదు గ్యారంటీలను అమలు చేసింది. పాలన పగ్గాలు చేపట్టగానే డిసెంబర్ 28-వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.
అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణం
అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటికే దాదాపు 23 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో కేవలం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని అమలు చేసింది. అర్హులైన పేద కుటుంబా లకు ఉచిత గృహ విద్యుత్‌ను అందించే గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, గూడు లేని వారికి ప్రభుత్వ స్థలంతో పాటు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిరుద్యోగులకు భరోసాగా….
ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ప్రభుత్వం భరోసానిచ్చింది. మూడు నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. వీరిలో 53 శాతం పురుషులు, 47 శాతం మహిళలకు అవకాశం కల్పించింది. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, టిఎస్పీఎస్సీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఈ నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. వీటికి అదనంగా సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలు కల్పించింది.
ఆరు గ్యారంటీల అమలుకు సుమారు రూ.80 వేల కోట్లు
గత పదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 6.71 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలకు సుమారు రూ.80 వేల కోట్లు అవసరమవుతుందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఒకవైపు పాత అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపులకు రాష్ట్ర స్వీయ పన్నుల వసూళ్లలో దాదాపు 35 శాతం వెచ్చిస్తోంది. ప్రస్తుతం నిధుల లేమి నెలకొన్నా, హామీలు ఆలస్యమైనా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహారిస్తుందని ఇప్పటికే అనేకమార్లు సిఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు హామీనివ్వడంతో పాటు ఆ దిశగా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
ఇప్పటివరకు అమలైన ఐదు హామీలు
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల వరకు చికిత్స ప్రారంభం- డిసెంబర్ 9, 2023న, మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం – డిసెంబరు 9, 2023న సిఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. వీటితోపాటు 200 యూనిట్ల (నెలకు) వరకు ఉచిత విద్యుత్ – ఫిబ్రవరి 27, 2024, తెల్ల రేషను కార్డు ఉన్నవారికి రూ.500లకే వంట గ్యాస్ – ఫిబ్రవరి 27, 2024 , సొంతిల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు- మార్చి 11, 2024 పథకాలను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రారంభించుకుంది.
రానున్న రోజుల్లో అమల్లోకి వచ్చేవి….
మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 చొప్పున మహాలక్ష్మి ఆర్థిక సాయం, రైతు భరోసా పేరుతో రైతులు, కౌలు రైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం, రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12,000ల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ (ఎంఎస్పీకి అదనంగా), ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల చొప్పున ఇంటి స్థలం, ప్రస్తుతం ఉన్న రూ. 2,016 పింఛను (ఆసరా)ను ‘చేయూత’ పేరుతో నెలకు రూ. 4,000కు పెంపు, విద్యార్థులకు రూ. 5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు వంటివి రానున్న రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతోంది.
జాబ్ క్యాలండర్ అమలుకు ప్రయత్నాలు
గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ల వివాదాలు, ఫలితాల నిలిపివేతలు, కోర్టు కేసులను ఒక్కోక్కటిగా ప్రభుత్వం అధిగమిస్తోంది. టిఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసింది. గత పాలకవర్గాన్ని తప్పించి కొత్త చైర్మన్‌ను, బోర్డు సభ్యులను నియమించింది. యూపిఎస్సీ తరహాలో టిఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగ నియామకాలతో పాటు జాబ్ క్యాలండర్ అమలుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో పరీక్షల నిర్వహణ వైఫల్యాలతో గ్రూప్ 1 పరీక్ష రెండుసార్లు రద్దయ్యింది. కొత్త ప్రభుత్వం అప్పటి పరీక్షను రద్దు చేసింది. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్‌తో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా డిఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
గత ప్రభుత్వం విధ్వంసం చేసిన వ్యవస్థలను సరిదిద్దడానికి….
గత ప్రభుత్వం విధ్వంసం చేసిన వ్యవస్థలను ప్రజలకు చాటిచెప్పేందుకు రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. విద్యుత్ విభాగంలో జరిగిన అవినీతి అక్రమాలు అవకతవకలను అసెంబ్లీలోనే వెల్లడించింది. ఇరిగేషన్ విభాగంపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణ చేపట్టడంతో పాటు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన ఫిల్లర్‌లను పరిశీలించింది.
రక్షణ శాఖ వద్ద పెండింగ్ సమస్యలకు గ్రీన్‌సిగ్నల్
ఎనిమిదేళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యకు సిఎం రేవంత్‌రెడ్డి చేసిన కృషికి కేంద్ర రక్షణ శాఖ స్పందించింది. కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ భూములపై కారిడార్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. మొహిదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న రక్షణ భూముల అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు హైదరాబాద్- టు రామగుండం రాజీవ్ రహదారిపై రూ.2,232 కోట్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌కు మార్చి 7వ తేదీన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అల్వాల్ సమీపంలో శంకుస్థాపన చేయడం ఈ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటితో పాటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు జాతీయ రహదారి 44 పై రూ.1580 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి మార్చి 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ్లకోయ వద్ద పునాది రాయి వేసి ప్రజలకు అందాల్సిన అభివృద్ధి పనులను ఒక్కోక్కటిగా ఈ ప్రభుత్వం ప్రారంభించుకుంటుంది.
రూ.2,700 కోట్లతో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో ఒప్పందం
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణకు ఫరూక్ నగర్ వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఫేజ్ 2లో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. రూ.2,700 కోట్ల తో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించనట్టువుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
దావోస్ పెట్టుబడులు కొత్త రికార్డు…
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడులను ఆకర్షించటంలో తెలంగాణ కొత్త రికార్డును సాధించింది. దాదాపు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 30 వేల ఉద్యోగాల కల్పనకు భరోసాను తీసుకొచ్చింది. వీటితో పాటు 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2 త్వరలోనే ప్రారంభిస్తామని బయో ఆసియా -2024 సదస్సులో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని భరోసాను కల్పించడంతో పాటు వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేసేలా ఈ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం విశేషం.
2,601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం
నేరుగా రైతుల సమస్యల ను పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్నంగా రైతునేస్తం కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసింది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్‌లను నెలకొల్పింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రూ.97 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ధరణి సమస్యల పరిష్కారానికి అయిదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించి పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది.
హైదరాబాద్‌లో డ్రగ్స్ చలామణిపై ఉక్కుపాదం
హైదరాబాద్‌లో ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మూసీ పునరుజ్జీవం, పరీవాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు, డిజైన్లు, ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ చలామణిపై ఉక్కుపాదం మోపింది. నార్కోటిక్స్ నియంత్రణ. టిఎస్ నాబ్ ను గ్రేహాండ్స్, ఆక్టోపస్ తరహాలో పటిష్టం చేయాలని నిర్ణయించింది. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమాను వర్తింపచేయడంతో పాటు 43 వేల మంది కార్మికులకు అది వర్తించేలా కోటి రూపాయల ప్రమాద బీమాను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.
పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050 అమల్లోకి….
బంజారాహిల్స్‌లో బాబు జగజీవన్ రామ్ భవన్‌ను ప్రారంభోత్సవం చేసింది. ఎల్బీనగర్ సమీపంలో బైరామల్ గూడ వద్ద ఫ్లై ఓవర్, ఉప్పల్ సమీపంలో నల్లచెరువు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ప్రారంభించుకుంది. దీంతోపాటు హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలం కేటాయించి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమస్యను పరిష్కరించింది. వీటితో పాటు పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050ను రూపొందిస్తోంది. ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్. వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో దేశంలో రెండో విఎల్‌ఎఫ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున…
ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున నియోజకవర్గాల అభివృద్ధికి రూ.1,190 కోట్లను ఈ 100 రోజుల పాలనలో ఈ ప్రభుత్వం కేటాయించింది. ఆదిలాబాద్‌లో జాతీయ రహదారుల శంకుస్థాపన చేయడంతో పాటు పింపుల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించుకుంది. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసుకుంది. మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలకు భూమిపూజను చేసింది. గద్దర్ విగ్రహం ఏర్పాటుతో పాటు కవులు కళాకారులు సినీ ప్రముఖులకు గద్దర్ పేరు మీద అవార్టులను ఇవ్వాలని నిర్ణయించింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు శంకుస్థాపనతో పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది.
ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల పారితోషకం అందించి ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. దీంతోపాటు స్వయం సహాయక సంఘాలకు చేయూతగా కొత్త కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉర్దూ అకాడమీ ఏర్పాటుతో పాటు ఎన్‌ఆర్‌ఎస్సీతో స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఒప్పందం చేసుకొని డ్రోన్ పైలట్లకు శిక్షణ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్‌లో ఉండే టిఎస్‌ను టిజిగా మార్చి తెలంగాణ వాసుల చిరకాల కోరికను నెరవేర్చింది.
ప్రయాణికుల కోసం 100 కొత్త బస్సులు
ప్రయాణికుల కోసం 100 కొత్త బస్సులను ప్రారంభించుకుంది. రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణను అమల్లోకి తీసుకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. గొర్రెల పంపిణీ పథకం, చేప పిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ చేయాలని సూచించింది. ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణతో పాటు మిషన్ భగీరథ విలేజ్ లెవల్ ఇంట్రా పైపులైన్లు, గ్రామాల్లో పనులపై అధికారులు ఇప్పటికే విచారణ చేపట్టడం విశేషం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబి అధికారుల పాత్రపై విచారణ జరపడంతో పాటు వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో రూ. వందల కోట్ల కుపైగా వ్యాట్ ఎగవేతపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇలా 100 రోజుల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణకు ఆదేశించి ప్రజలకు మేలు చేసేలా చర్యలు చేపట్టడం సిఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ పాలనకు నిదర్శంగా చెప్పవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీలు
ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా భూములకు, ఉద్యోగాలకు సంబంధించినవే కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి ద్వారా భూములపై హక్కులు కోల్పోయిన పేదలు, రైతులకు పరిష్కారం కనుగొనడానికి నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయి అధ్యయనం చేసిన ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎమ్మార్వో మొదలు కలెక్టర్ స్థాయి వరకు పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. త్వరలో పలు మార్పులతో ‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ ఉనికిలోకి రానుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కులగణనపైనా, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలేంత వరకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని అసెంబ్లీలో వేర్వేరు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగానికి అప్రూవల్ తెచ్చుకొని పడకేసిన ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి అడుగు ముందుకేసింది.