Saturday, May 24, 2025

11 నెలలు…2,338 ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ పూర్తి

దాదాపు 210 ఫిర్యాదులకు తీర్పులు
నిబంధనలను అతిక్రమించిన 918 ప్రాజెక్టులు
రూ.30 కోట్ల పైచిలుకు జరిమానా
విధించిన రెరా అథారిటీ

రెరా అథారిటీ ఏర్పడిన 11 నెలల కాలంలో 2,338 ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయడంతో పాటు దాదాపు 210 ఫిర్యాదులకు తీర్పులు జారీచేసిందని రెరా అథారిటీ తెలిపింది. 2018 నుంచి ఇప్పటివరకు 8,270 ప్రాజెక్టులకు రెరాలో రిజిస్ట్రేషన్లు జారీ చేసినట్లు అథారిటీ పేర్కొంది. అదేవిధంగా 918 ప్రాజెక్టులు రెరా నిబంధనలు అత్రిక్రమించినట్లు గుర్తించి రూ.30 కోట్ల 99 లక్షల 12 వేల 963 రూపాయల అపరాధ రుసుముగా విధించినట్లు రెరా అధికారులు తెలిపారు. అందులో రూ.13 కోట్ల 70 లక్షల 8 వేల 925 రూపాయలు రికవరీ చేసినట్లు అథారిటి పేర్కొంది. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై రెరా ఎంతమాత్రం ఉపేక్షించబోదని, రియల్ రంగంలో మోసాలకు అట్టుకట్ట వేసి కొనుగోలు దారుల ప్రయోజనాలను కాపాడేందుకు రెరా చట్టం పాటుపడుతుందని అథారిటీ తెలిపింది.

శనివారం పలు కంపెనీలకు నోటీసులు
అందులో భాగంగా రెరా నిబంధనలు ఉల్లంఘించిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు రెరా అధికారులు తెలిపారు. శనివారం పలు కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్టు వారు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న కంపెనీలు మియాపూర్ ప్రజ్ఞ ఎకోస్పేన్, చింతల్ కుంట శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్, కొండాపూర్ నార్త్ ఈస్ట్ హెబిటీషన్స్, సంగారెడ్డి జిల్లా వి.ఆర్. ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్, కెపిహెచ్‌బి కాలనీ ఇన్వెస్టు ఇన్ఫ్రా ప్రాజెక్టు, కొంపల్లి భారతి లేక్యూ టవర్ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రెరా నిబంధనలు ఉల్లంఘించినందున 15 రోజుల్లోగా సంజాయిషీ సమర్పించాలని ఆదేశిస్తూ పోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు రెరా అథారిటీ తెలిపింది.

ఫిర్యాదులు ఈ నెంబర్‌లలో చేయాలి
రియల్ ఎస్టేట్ కంపెనీలు జిహెచ్‌ఎంసి/హెచ్‌ఎండిఏ/డిటిసిపి/ ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు రెరా రిజిస్ట్రేషన్ ఉంటేనే కొనుగోలుదారులకు భద్రత, భరోసా చేకూరుతుందని రెరా అధికారులు తెలిపారు. ఇల్లు, ఫ్లాట్ కొనాలనుకునే వారు రెరా రిజిస్ట్రర్ ప్రాజెక్టుల్లో మాత్రమే కొనుగోలు చేయాలని రెరా అథారిటి సూచించింది. ఫ్రీలాంచ్ ఆఫర్లను నమ్మి రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల్లో కొని మోసపోరాదని రెరా అథారిటి విజ్ఞప్తి చేసింది.

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే వాట్సప్ నెం: 9000006301, ఫోన్ నెంబర్ 040-29394972తో పాటు మెయిల్ ఐడిలు rera-maud@telangana.gov.in, secy-rera-maud@telangana.gov.in లకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని రెరా అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించి ‘రెరా’ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే సెక్షన్ 59 ప్రకారం అపరాధ రుసము విధించడంతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని రెరా అథారిటీ స్పష్టం చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com