రాష్ట్రంలో కంపెనీల ఏర్పాటుకు క్యూ కడుతున్న ప్రముఖ సంస్థలు 2023 డిసెంబర్ నుంచి దాదాపు
రూ.50 వేల కోట్ల పెట్టుబడులను పెట్టడానికి టిజిఐఐసీకి దరఖాస్తులు మొదటిదశలో 113 కంపెనీలకు భూ కేటాయింపులు చేసిన అధికారులు ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు వేగంగా గ్రీన్సిగ్నల్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రూ. 50వేల కోట్ల కొత్త పెట్టుబడులకు సంబంధించి దరఖాస్తులు అందాయని టిజిఐఐసీ అధికారులు వెల్లడించారు.
ఆయా సంస్థలకు భూమిని కేటాయించడానికి చర్చలు జరుపుతున్నామని టిజిఐఐసీ అధికారులు తెలిపారు. మొదటిదశలో అర్హత ఉన్న కంపెనీలకు భూముల కేటాయించాలని టిజిఐఐసీ నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీల ఏర్పాటు, పెట్టుబడులు పెట్టేందుకు 140 కంపెనీలు దరఖాస్తు పెట్టుకోగా ఇందులో 113 పరిశ్రమలు అర్హత సాధించాయని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన కార్పొరేషన్ (టిజిఐఐసీ) పేర్కొంది. మూడు నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున భూకేటాయింపులు చేయలేదని ఆ సంస్థ తెలిపింది. కోడ్ ముగిసిన తర్వాత 113 కంపెనీలకు భూ కేటాయింపులు చేసినట్టు పేర్కొంది.
వీటి ద్వారా రాష్ట్రానికి రూ. 2,200 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు దాదాపు 7వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు అందుతాయని అధికారులు పేర్కొన్నారు. భూమి కేటాయించిన కంపెనీల్లో ఫ్రాన్స్‌కు చెందిన మానే, హాంకాంగ్‌కు చెందిన ఏపిసి, మలబార్ గోల్ వంటి మార్క్ ఇన్వెస్టర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూ కేటాయింపుల్లో అగ్రభాగం ( 70 శాతం ) మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. టిజిఐఐసీ ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించిందని అధికారులు పేర్కొన్నారు.