- మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగా
- ల్యాండ్ పూలింగ్ కింద భూ సేకరణ చేయనున్న అధికారులు
- రూట్‌మ్యాప్‌నకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే పనులు ప్రారంభం
మెట్రో రైలు రెండో దశ పనుల కోసం భూ సేకరణ చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మొత్తం 14 స్టేషన్‌లు నిర్మాణం జరుగనుండగా వాటి కోసం ల్యాండ్ పూలింగ్ కింద భూ సేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే అధికారులు పనులు చేపట్టనున్నారు. మహానగరంలో ట్రాఫిక్ సమస్యను అదిగమించడం కోసం ప్రతిష్టాత్మకంగా మెట్రో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటి దశ మెట్రోకు భారీ స్పందన రావడంతో రెండోదశ మెట్రో లైన్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పలు మార్గాల్లో ప్రాజెక్టు నిర్మాణం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది.
14 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం
దీంతో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు దాదాపు 14 కిలోమీటర్ల మెట్రోను నిర్మించడానికి రూట్ ఖరారు చేసింది. చాంద్రాయణగుట్ట నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో లైన్ పోడిగించే విధంగా ఈ రూట్ మ్యాప్ తయారు చేసింది. ఈ లైన్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభమై నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆస్పత్రి, ఎల్బీనగర్ సర్కిల్, సాగర్ రింగ్ రోడ్డు, మైత్రినగర్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మొత్తం 14 స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ రూట్ మ్యాప్‌నకు ప్రభుత్వం అంగీకరించి, ల్యాండ్ పూలింగ్ చేస్తే అతి త్వరలోనే మెట్రో రెండో దశ పనులు ప్రారంభంకానున్నాయి.