హైదరాబాద్‌లో 13.. వరంగల్ అర్బన్‌లో ఒకటి
రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో మొత్తం 100 కొత్త పోలీస్ స్టేషన్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ, కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో అందుకు ముహూర్తం కూడా ఖరారైంది. కొత్త ఎక్సైజ్ స్టేషన్ లకు ముహూర్తం ఖరారు ఏప్రిల్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో మొత్తం 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. వీటిలో 13 హైదరాబాదులో ఏర్పాటు చేస్తుండగా, వరంగల్ అర్బన్ లో ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో మద్యం, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 2020లోనే ప్రతిపాదించిన ఈ స్టేషన్ల ఏర్పాటుకు ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు.. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 1 నుంచే వీటిని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త స్టేషన్లు వెంటనే అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్ రావు ఆదేశించారు.
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020లోనే 14 కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. అప్పటి నుంచి పలు అడ్డంకులు ఏర్పడుతూ వస్తుండగా.. ఎట్టకేలకు ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది. స్టేషన్ల విభజన, ప్రాంతాల ఎంపిక, సిబ్బంది బదిలీ వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ప్రభుత్వ అనుమతులు రావడంతో ఎక్సైజ్ శాఖ వేగంగా చర్యలు తీసుకుంటోంది. “కొత్త పోలీస్ స్టేషన్లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని అజయ్ రావు ఆయా డిప్యూటీ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త స్టేషన్ల కోసం అద్దె భవనాలను వెతకాలని కమిషనర్ ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని బంజారా హిల్స్, చిక్కడపల్లి, గండిపేట్, కొండపూర్, పెద్ద అంబర్‌పేట్, కూకట్‌పల్లి, అమీన్‌పూర్, హసన్‌పర్తి స్టేషన్లకు అద్దె భవనాలు దొరకగా.. మారేడ్‌పల్లి, మీర్‌పేట్, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్ స్టేషన్లకు మాత్రం ఇంకా అద్దె భవనాలు దొరకలేదు. దీంతో వాటిని ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోనే ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఈ కొత్త స్టేషన్లు ప్రారంభమైతే మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.