- మైనింగ్ కార్యకలాపాల్లో అక్రమాలు, అవినీతి…?
- ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి
- అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఓ మైనింగ్ ఉన్నతాధికారి
మైనింగ్ కార్యకలాపాల్లో భారీగా అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి ఓ ఉన్నతాధికారి గండికొడుతున్నారు. ఓ ఉన్నతాధికారి తెలంగాణ మైనింగ్ శాఖలో పనిచేస్తూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కనుసన్నల్లోనే మైనింగ్ ఆ శాఖ నడుస్తుందని, పలు జిల్లాలోని క్వారీలు, గ్రానైట్ వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. త్వరలోనే ఆయన పదవీ విరమణ ఉండడంతో, మరోసారి తనకు ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వంలోని పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయన ఉన్నట్టుగా తెలిసింది. మరో సంవత్సరం పాటు తనను అదే పదవిలో కొనసాగించేలా పలువురితో ఆయన ఫైరవీలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఆయన పలు జిల్లాలోని క్వారీల్లో వాటాదారుడని ఆశాఖకు చెందిన అధికారులు బాహాటంగా పేర్కొనడం విశేషం.
పలు జిల్లాలో అక్రమ మైనింగ్
ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డిలతో పాటు సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అక్రమ మైనింగ్ తీవ్రత అధికంగా ఉండడంతో అక్కడ తనిఖీలు చేయకుండా ఈ అధికారికి భారీగా ముడుపులు అందుతున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు ఒక్కో జిల్లాలో రోజుకు 100 నుంచి 200ల పైచిలుకు లారీల్లో అక్రమంగా తరలించే ఖనిజాన్ని అనేక గనుల నుంచి వేబిల్లులు లేకుండానే తరలిస్తున్నారని, దీనివెనుక ఈ అధికారి హస్తం ఉందని, దీనివల్ల ప్రభుత్వానికి అందాల్సిన రాయల్టీ, సీనరేజ్ ఎగవేతకు గురవుతున్నట్టుగా సమాచారం.
గత ప్రభుత్వంలో కొందరు అధికారుల అండదండలతో కొన్ని సంస్థలు, కొందరు నాయకులు సహజ సంపదనను దోచుకున్నారని, వారితో ఈ అధికారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో లబ్ధిపొందిన క్వారీ యజమానులను, గ్రానైట్ వ్యాపారులను బెదిరించి వారి నుంచి ఈ అధికారి అందినంత దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ ఆగిపోయింది….
ఈ మధ్య కొన్ని జిల్లాలోని క్వారీలపై ఆరోపణలు రావడంతో రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లాల మైనింగ్ శాఖ అధికారులు విచారణ చేపట్టాలని ఆదేశాలు రావడంతో చాలామంది క్వారీలు, గ్రానైట్ వ్యాపారులు ఈ అధికారిని ప్రసన్నం చేసుకున్నారని, ఈ నేపథ్యంలోనే వారిపై విచారణ ఆగిపోయిందని పలు జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ అధికారి అవినీతి వల్ల క్వారీలను లీజు తీసుకున్న వారు ఇచ్చిన దానికంటే అధికంగా ఆ చుట్టుపక్కల తవ్వకాలు సాగిస్తున్నట్టు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. గతంలో కొన్ని క్వారీల లీజుప్రాంతాలను, మైనింగ్, ఖనిజాల్ని రవాణా చేస్తున్న వాహనాలను కూడా ఈ అధికారి తనిఖీ చేయకుండా ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.
లీజుదారులు తవ్వితీసిన ఖనిజానికి మేజర్ మినరల్ అయితే రాయల్టీ రూపంలో మైనర్ మినరల్ అయితే సీనరేజ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించి వేబిల్లు తీసుకోవాలి. అయితే పలువురు లీజుదారులు రాయల్టీ, సీనరేజ్ ఎగవేతకు పాల్పడుతూ ఖనిజాన్ని తీసి అమ్మేసుకుంటున్నారని, అనేక గనుల నుంచి వేబిల్లులు లేకుండానే వాటిని తరలిస్తున్నారని, ఈ అధికారి నిర్వాకం వల్ల పలువురు అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. ఈ అధికారి అవినీతి గురించి నాలుగు నెలల క్రితం సచివాలయంలోని ఓ ఉన్నతాధికారికి ఫిర్యాదులు అందడంతో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులను హెచ్చరించినట్టుగా సమాచారం.
నిబంధనలు గాలికి..
క్రషర్ నిర్వహణకు సంబంధించి మైనింగ్‌శాఖ తమకు కేటాయించిన స్థలంలో క్రషర్, క్వారీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో కాలుష్యాన్ని కొలిచే యంత్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దూమ్ముధూళి రాకుండా ఎప్పుడు నీటిని వెదజల్లేలా, దుమ్ము గాలిలోకి లేవకుండా క్రషర్‌కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయకుండా ఈ అధికారి అండదండలతో యథేచ్ఛగా క్రషర్, క్వారీలను కొందరు యజమానులు నిర్వహిస్తున్నారని దీనివల్ల తమ కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం విశేషం. ఖనిజాలు, సహజ వనరులను నిబంధనల ప్రకారం అనుమతులు లేకుండా నిర్వహించడమే కాకుండా ప్రకృతి అందించిన వనరులను కొల్లగొడుతూ పలువురు క్వారీ యజమానులు రూ.కోట్ల రూపాయల సంపదను దోచుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తడం విశేషం.