తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం అమ్ముడుపోయింది. గడిచిన వారం రోజులు మద్యం డిపోల నుంచి దుకాణదారులకు సరఫరా అయిన మద్యం తీసుకుంటే ప్రతి రోజు దాదాపు రూ.200 కోట్ల విలువైన మద్యం సరఫరా అయినట్లు తెలుస్తోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్, 45.09లక్షల కేసులు బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఏకంగా రూ.37,682 కోట్లు విలువైన 3.76 కోట్లు కేసులు లిక్కర్, 5.47 కోట్ల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి.
భారీగా అమ్ముడుపోయిన మద్యం : ఇక న్యూయర్ వేడులకల్లో భాగంగా మద్యం భారీగా అమ్ముడుపోతుందని దుకాణదారులు భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ చేసుకున్నారు. డిసెంబర్ నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పది రోజుల్లో రెండు ఆదివారాలు, ఒక క్రిస్మస్ మూడు సెలవు రోజులు పక్కన పెడితే మిగిలిన 7 రోజులు డిపోల నుంచి భారీగా మద్యం సరఫరా అయ్యింది. వారం రోజుల్లో ఏకంగా దాదాపు రూ.1700 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి అమ్ముడుపోయింది. వారం రోజుల్లో 1700 కోట్ల మద్యం అమ్మకాలు : వారం రోజులు జరిగిన మద్యం విక్రయాలను పరిశీలించినట్లయితే ఈ నెల 23వ తేదీన రూ.193 కోట్లు, 24వ తేదీన రూ.197 కోట్లు, 26వ తేదీన రూ.192 కోట్లు, 27వ తేదీన రూ.187 కోట్లు, 28వ తేదీన రూ.191 కోట్లు, 30వ తేదీన రూ. 402 కోట్లు, 31వ తేదీన రూ.282 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి మద్యం దుకాణాలకు చేరినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన అమ్మకాలను పరిశీలించినట్లయితే రూ.1510 కోట్లు మాత్రమేనని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు వందల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోయినట్లు స్పష్టం అవుతోంది.