సివిల్ సప్లై కార్పొరేషన్‌ను మరింత పాతాళంలోకి తొక్కే కుట్ర
దాదాపు రూ. 750 కోట్లకు పైగా స్వాహాకు యత్నం
బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్
సీబీఐ విచారణకు డిమాండ్
వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బిజెపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పిలిచిన దాదాపు 35 లక్షల టన్నుల వడ్ల టెండర్‌కు సంబంధించి పారదర్శకత లోపించిందని, ఇందులో దాదాపు రూ. 750 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టెండర్ల పక్రియ నిర్వహించిన విధానమే ఈ అనుమానాలకు కారణమని ఆయన తెలిపారు. టెండర్ పక్రియలో పాల్గొన్నవారికి వేలకోట్ల రూపాయల సామర్థ్యం ఉండాలని కండిషన్లు పెట్టి..తమ అనుయాయులకు మాత్రమే అవకాశం దక్కేలా చేశారని ఆయన దుయ్యబట్టారు. ఎక్కువమంది బిడ్డింగ్‌లో పాల్గొంటే వాళ్ల అక్రమాలకు అవకాశముండదని, కండిషన్లు పెట్టి చాలామంది మిల్లర్లు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చేశారని శంకర్ అన్నారు.
శనివారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు సంగప్ప, విఠల్, బిజెపి సీనియర్ నాయకుడు మురళీధర్ గౌడ్, తదితర నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాయల్ శంకర్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించాల్సిన వడ్ల కొనుగోలు టెండర్లను తక్కువ ధరకే బిడ్డర్లకు అప్పగించి, వేల కోట్ల రూపాయల అక్రమాలకు, అవతవకలకు కారణమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 90 రోజుల్లోగా 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను రూ.7,250 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చెల్లించి, మిల్లర్ల దగ్గరి నుంచి తీసుకెళ్తామన్న బిడ్డర్లపై ఈరోజు ఇచ్చిన గడువు దాటిపోయినా, ప్రభుత్వం బిడ్డర్లకు కనీస ఫెనాల్టీ ఎందుకు వేయలేకపోయిందని పాయల్ శంకర్ ప్రశ్నించారు. అలాగే కట్టినటువంటి డిపాజిట్‌ను ప్రభుత్వం ఎందుకు జప్తు చేయడం లేదని ప్రశ్నించారు.
మిల్లర్లంతా ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టి వడ్లు కొనుగోలు చేసిందో అంత వాళ్ల దగ్గరున్న స్టాక్‌కు డబ్బు చెల్లిస్తామన్నా కూడా ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వలేదని శంకర్ వెల్లడించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు టెండర్ పెడితే బిడ్డర్లు 90 రోజుల లోపల రూ. 7,245 కోట్లు బిడ్డర్లు ప్రభుత్వంకు చెల్లించి, వడ్లను తీసుకెళ్లాల్సి ఉండగా…అలా జరగకుండా మిల్లర్ల దగ్గర నుంచి బిడ్డర్లు నేరుగా రూ. 2,230 డబ్బు చెల్లించమని ఒత్తిడి చేమడమేఊ కాకుండా, కొందరు మిల్లర్ల దగ్గర ఇప్పటికే డబ్బులు వసూలు చేశారంటూ మండిపడ్డారు. అంటే.. క్వింటాలుకు రూ. 227 చొప్పున టన్నుకు రూ. 2,270 బిడ్డర్ మిల్లర్ దగ్గర నుంచి అదనంగా వసూలు చేసినట్లు సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే, అదనంగా వసూలు చేసిన ఈ డబ్బు ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నించారు. 2024-25 ఖరీఫ్‌లో దాదాపు 75 లక్షల టన్నుల ధాన్యం వొచ్చే అవకాశముందని, అందుకే గోదాంలను ఖాళీ చేసేందుకే టెండర్ల ద్వారా వడ్లు అమ్మినట్లు చెబుతున్న ప్రభుత్వం మాటల్లో చిత్తశుద్ధి లేదని పాయల్ శంకర్ అన్నారు. బిడ్లను దక్కించుకున్నన వ్యక్తులు ఇప్పటివరకు కనీసం 10 లక్షల టన్నుల ధాన్యం కూడా లిఫ్టు చేయలేదని, 2023-24 ఖరీఫ్‌లో కొన్నటువంటి 30 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్, 2023-24 రబీ లో కొన్నటువంటి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలతో గోదాంలు నిండుగా ఉన్నాయని చెప్పారు.
మరి, త్వరలో రాబోయే 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేస్తారని ఆయన నిలదీశారు. ఒకవేళ బిడ్డర్లు వెంటనే మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రాబోయే పంట మళ్లీ రోడ్డుపాలు అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గత సీజన్‌లో వర్షానికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిచి రైతులు తీవ్రంగా నష్టపోయారని పాయల్ శంకర్ గుర్తు చేశారు. అంతే కాకుండా క్వింటాలుకు 2007 రూపాయల చొప్పున కొన్న బిడ్డరు.. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధర, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ తో కలిపి ధర పెరగనుండటంతో ఈ వడ్లనే రీసైక్లింగ్ చేసే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జరిగితే అది మరో పెద్ద కుంభకోణానికి దారితీస్తుందని హెచ్చరించారు.
ఇప్పటికే సివిల్ సప్లై కార్పొరేషన్ దాదాపు 55 వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన గుర్తుచేశారు. పారదర్శకత లేని ప్రభుత్వ నిర్ణయాలతో సివిల్ సప్లై కార్పొరేషన్ పూర్తిగా అధ:పాతాళానికి పోవడం ఖాయమని శంకర్ పేర్కొన్నారు.వడ్లు కొనుగోలు చేసిన మిల్లర్ల ఆస్తుల విలువలు కేవలం లక్షల్లో ఉన్నప్పటికీ.. కోట్లాది రూపాయల సొమ్మును వారి నుంచి ఎలా రికవరీ చేస్తుందని శంకర్ నిలదీశారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు టెండర్లలో జరిగినటువంటి అవకతవకలపై న్యాయనిపుణులతో లోతుగా చర్చించి, పార్టీ అనుమతితో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని శంకర్ తెలిపారు. ఈ భారీ కుంభకోణంపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేయడానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందని శంకర్ వెల్లడించారు.