- ఆపరేషన్ చేయూత’ సక్సెస్
- 8 లక్షలు ఒకరికి, 4 లక్షలు చొప్పున ఇద్దరు మావోయిస్టులకు రివార్డు
- వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజు
పోలీస్ శాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా అనేక మంది మావోయిస్టు పార్టీలో ఉన్న మిలీషియా సభ్యులు ఉన్నత క్యాడర్‌లో ఉన్న మావోయిస్టులు లొంగిపోతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చెప్పారు. గురువారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది వివిధ క్యాడర్‌లో ఉన్న మావోయిస్టులు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయూత కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని తెలిపారు. గతంలో మావోయిస్టులకు భయపడి రోడ్లు, రహదారి సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం ప్రజల సహకారంతో మారుమూల గ్రామాలకు సైతం రహదారి సౌకర్యం కల్పిస్తూ రోడ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీలో విసుగు చెంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు.
తమ వద్ద లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గురువారం లొంగిపోయిన వారిలో ఇద్దరు మావోయిస్టులకు వట్టిదేవ, మడకం గంగి లకు 4 లక్షల చొప్పున రివార్డు అందించినట్లు తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో గత నెల జనవరిలో చర్లలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఎదుట 22 మంది మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ క్యాడర్ వారు లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి పోలీసుల వద్ద లొంగిపోతున్నారని చెప్పారు.
అటువంటి వారిపై పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ద చూపుతూ అన్నీ విధాలా ఆదుకుంటునట్లు తెలిపారు. సౌత్ బస్తర్ డివి సియం నరోటి మనీష్ అలియాస్ ఆకాశ్ ఉండగా అతనిపై 8 లక్షల రివార్డు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించిందని లొంగిపోయిన వారిలో పిఎల్‌జిఏ మొదటి బెటాలియన్‌కు చెందిన మడివి నందా , మడివి హండా, మడివి అడమతో సహా పలువురు సెంట్రల్ కమిటి సభ్యులు లొంగిపోయినట్లు తెలిపారు. గత సంవత్సరం నుండి ఇప్పటివరకు 78 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. 64 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి పారితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ అధికారులు తదితర్నురలు పాల్గొన్నారు.