- ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పని
- బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తోంది
బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, కానీ, తామే ఆపామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జన్వాడలో జరిగింది రేవ్ పార్టీ కాదు, రావుల పార్టీ అని మంత్రి ఎద్దేవా చేశారు. కులగణనకు సంబంధించి గాంధీభవన్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తెలిపారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఇబ్బంది ఉన్నా మేనిఫెస్టోలో ప్రకటించని హామీలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించడమే బిఆర్‌ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. వెనుకబడిన కులాలపై బిఆర్‌ఎస్‌కు ఏమాత్రం ప్రేమ లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బలహీన వర్గాలకు చెందిన నాయకుడే ఉన్నారని ఆయన వెల్లడించారు. కులగణన చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసం బిఆర్‌ఎస్ తాపత్రయం: మంత్రి జూపల్లి
ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో వచ్చే నెల 31వ తేదీ లోగా కులగణనను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారమే పదవులు ఉంటాయన్నారు. కులగణనలో సామాజికవర్గాల వారీగా ఎంత మంది ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. కెటిఆర్, హరీష్‌రావులు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధిపొందుతున్నారని ఆయన తెలిపారు.
మంత్రిగా ఉన్న తానే మూసీ రివర్ బెల్ట్‌లో ఉన్నానని, ఎసిలో ఉన్నా తనకే కంపు వాసన వస్తోందని ఆయన తెలిపారు. పది నెలల్లో 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, మీ హయాంలో కనీసం డిఎస్సీ వేశారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసి మూసివేసి అడుక్కనే పరిస్థితికి తీసుకొచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ ధనిక రాష్ట్రం అని ప్రచారం చేశారని, మరీ అప్పుల కుప్పగా ఎందుకు మారిందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ పార్టీకి అన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలపాలన్నారు.. జాతీయ కాంగ్రెస్ పార్టీకి లేనన్ని నిధులు బిఆర్‌ఎస్ పార్టీకి అవినీతి అక్రమల మార్గంలోనే వచ్చాయన్నారు.