Sunday, October 6, 2024

జైలు శాఖ చరిత్రలో మైలురాయి..

నేడు 213 మంది ఖైదీల విడుదల

శిక్షాకాలంలో సత్ర్పవర్తన తో మెలిగిన ఖైదీల విడుదలకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని 13 జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 213 మంది ఖైదీలు ఆయా కారాగారాల నుంచి నేడు విడుదల కానున్నారు. మరోవైపు బయటికి వెళ్లి మళ్లీ నేరప్రవృత్తి వైపు మొగ్గు చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా.. ఏకకాలంలో 213 మంది ఖైదీల విడుదల తెలంగాణ జైళ్ళ శాఖ చరిత్రలో ఓ మైలు రాయి లాంటిదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలో ఖైదీల కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యుల విడుదలకు చొరవ చూపాలని దరఖాస్తులు ఇచ్చారన్నారు. వీరి వినతులను దృష్టిలో ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి.. సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరారని వివరించారు.

దీంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగూణంగా రాష్​ఠ్ర హైలెవెల్ కమిటీ ఖైదీల జాబితా సిద్ధం చేసిందన్నారు. ఈ జాబితాను శాఖ తరుపున కేబినెట్‌కు పంపామన్న ఆమె.. అక్కడ ఆమోదం పొందిన తరువాత గవర్న ర్ కూడా ఆమోదించారని డీజీ తెలిపారు. దీంతో ఖైదీల విడుదలకు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. నేడు విడుదల కానున్న ఖైదీల్లో 205 మంది యావజ్జీవ కారాగర శిక్ష అనుభవించిన వారుండగా, ఎనిమిది మంది స్వల్ప కాలిక శిక్ష పడిన ఖైదీలున్నారని డీజీ వివరించారు. అత్యధికంగా చర్లపల్లి కేంద్ర కార్యాలయం నుండి 61 మంది ఖైదీలు నేడు విడుదలకానున్నారు. కాగా హైదరాబాద్( 27), వరంగల్ (20), చర్లపల్లి ఓపెన్​ ఎయిర్​ జైలు (31), మహిళ స్పెషల్​ జైలు (35), సంగారెడ్డి (01), నిజామాబాద్​ (15), మహబూబ్​ నగర్​ (02), నల్లగొండ, ఖమ్మం (04), ఆసిఫాబాద్​, ఆదిలాబాద్​ (03), కరీంనగర్​ (07) మొత్తం 213 మంది నేడు విడుదలకానున్నట్లు డీజీ తెలిపారు.

విడుదలవుతున్న ఖైదీలంద రికీ జీవితంలో ఇది రెండో అవకాశమనీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖైదీలకుహితవు చెప్పారు. అయితే జైళ్లలో ఖైదీలకు శిక్షే కాకుండా పలు వృత్తి విద్య నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. జైలులో ఖైదీలు తయారు చేసే వస్తువులకి మార్కెట్‌లో డిమాండ్ ఉందన్నారు. జైలుకు వచ్చిన వారిలో నిరక్షరాస్యులను సైతం అక్షరాస్యులుగా మార్చమ న్నారు. జైలులో చదువు కుని కొందరు ఖైదీలు పట్టభద్రులు అయ్యారని.. గోల్డ్ మెడల్ కూడా సాధించారని డీజీ చెప్పారు.

ఉపాధి అవకాశాలు..!
జైళ్ల నుంచి విడుదలవుతోన్న ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్న డీజీ సౌమ్య మిశ్రా.. వీరిలో 70 మందికి ఆయా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించామన్నారు. శిక్షకాలంలో ఇస్తున్న జీతం కంటే.. ఎక్కువ జీతం ఇస్తున్నామని తెలిపారు. మరో ముగ్గురు మహిళా ఖైదీలకు జైళ్ల శాఖ స్టోర్లలో ఉద్యోగాలిచ్చామనీ, ఇప్పటి వరకు విడుదలైన ఖైదీలలో మూడో వంతు ఖైదీలకు ఉపాధి కల్పించినట్లు వివరించారు. దీంతో పాటు జైలు నుంచి విడుదలయ్యాక ఉపాధి దొరక్కపోతే ఖైదీలు తమను సంప్రదించొచ్చని.. ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

కొంతమంది మహిళా ఖైదీ లు తమకు కుట్టు మిషన్ ఇస్తే ఉపాధి పొందుతామని అడిగారనీ, వారందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విడుదలైన ఖైదీలు మంచి పౌరులుగా ఉండి సమాజ సేవలో పాలుపంచుకోవాలని సూచించారు.విడుదలవుతున్న ఖైదీల పట్ల కుటుంబం, సమాజం సానుభూతితో ఉండాలని కోరారు. విడు దల అవుతున్న ఖైదీలకు ఇదే ఆఖరి అవకాశం అని స్పష్టం చేశారు. అలాగే జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలకు తమ స్వగ్రామా లకు వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిం చామని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular