Thursday, December 26, 2024

11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం

ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సుల్లో ప్రయాణించారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు. పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారు.

మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగింది. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగింది. ఈ నెల 16వ తేదిన 17 డిపోలు, 17వ తేదిన 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయింది. గత మూడు రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9 వ తేది నుంచి ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ స్కీంను టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది. సమర్థవంతంగా ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు ఈ నెల 15 నుంచి జీరో టికెట్లను మహిళలకు జారీ చేస్తోంది. ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య అమలు తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. దాదాపు 30 డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లతో స్వయంగా మాట్లాడారు. ఈ స్కీం అమలవుతున్న తీరు, వారికి తలెత్తుతున్న ఇబ్బందులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి, ప్రయాణికులకు పలు సూచనలు చేశారు.

ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పనిసరి
“ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోంది. ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్ లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నాం. ఫొటో కాపీలలు స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటోలు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. అతి తక్కువ టైంలోనే ఈ స్కీంను అర్థం చేసుకుని.. చాలా చిత్తశుద్ధితో సమర్థవంతంగా ఈ స్కీంను విజయవంతంగా అమలు చేస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు. ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ మర్యాదపూర్వకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

జీరో టికెట్ల విషయంలో కొందరు మహిళలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలని కోరారు. జీరో టికెట్ ను జారీ చేస్తేనే ఆ చార్జీని టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికాదని, రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను కోరారు.

త్వరలో 2050 కొత్త బస్సులు
“ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే ప్లాన్ చేస్తున్నాం. అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. విడతల వారీగా ఆ బస్సులు వాడకంలోకి వస్తాయి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com