-
మేం రాయం
-
డీఎస్సీ పరీక్షలకు అభ్యర్థులు దూరం
-
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు 31,105 మంది
డీఎస్సీ అభ్యర్థుల్లో ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. పరీక్షలు వాయిదా వేయాలని ఎంతపోరు పెట్టినా సర్కార్ వెనక్కితగ్గలేదు. దీంతో గురువారం నుంచి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా యథాతథంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లను మూసివేశారు. ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించారు. అయితే సర్కార్ తీరుపై ఆగ్రహించిన వేలాది మంది నిరుద్యోగులు తమ జీవితాలను పణంగా పెట్టేందుకూ వెనుకాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఏకంగా 31,105 మంది అభ్యర్ధులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోలేదు. వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తం చేశారు.
11,056 డీఎస్సీ పోస్టులకి మొత్తంగా 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జున్ 11వ తేదీనే అధికారులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచగా.. బుధవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,48,851 మంది మాత్రమే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 30 వేలకు పైగా అభ్యర్ధులు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పరీక్షలు రాయకుండా ఆందోళన చేపట్టారు. మరోవైపు వందలాదిమంది డౌన్‌లోడ్ చేసుకున్న తమ హాల్‌టికెట్లను కాల్చివేశారు. ప్రిపేరేషన్‌కు తగిన సమయం ఇవ్వలేదని, తాము పరీక్ష రాయబోమంటూ మండిపడ్డారు. అయితే మరోవైపు డీఎస్సీ వాయిదా వేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది. నిరుద్యోగుల తరపున సీనియర్ అడ్వకేట్ రవి చందర్ వాదనలు వినిపించారు. నోటిపికేషన్‌కు, పరీక్షలకు నాలుగు నెలల గడువుమాత్రమే ఇచ్చారని, గ్రూప్–1తో పాటుగా చాలా పరీక్షలు రాయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం తరపున ఏజీ రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కేవలం 10 మంది మాత్రమే పిటిషన్ వేశారని, వారి కోసం 2.45 లక్షల మంది నిరుద్యోగులను బలి చేయలేమన్నారు. ఈ పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారని వివరించారు. అయితే, పిటిషన్ వేసిన పది మంది డీఎస్సీ పరీక్షలకు అప్లై చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్–1తో పాటు డీఏవో, డీఎస్సీకి కూడా అప్లై చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది చెప్పారు. దీంతో డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయలేదని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చేనెల 28కి వాయిదా వేసింది.
కాగా, గురువారం ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు టెట్‌లో వెయిటేజీ ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ ఆఫైర్స్ విభాగం నుంచి 20 మార్కులు, విద్యా దృక్పథాలు విభాగం నుంచి 20 మార్కులు, కంటెంట్ నుంచి 88 మార్కులు, బోధనా పద్ధతుల నుంచి 32 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. డీఎస్సీలో అభ్యర్థులు సాధించిన మార్కులకు టెట్ వెయిటేజీని కలిపి.. మొత్తం 100 మార్కులకు ర్యాంకు నిర్ణయిస్తారు. పీఈటీ పోస్టులకు టెట్ ఉండదు కాబట్టి వీరికి మొత్తం 200 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.