- సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాలు…
- ఐదేళ్లు 22.50 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక
- ప్రభుత్వానికి ఇప్పటికే 82.82 లక్షల దరఖాస్తులు
- రూ.1,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసిన హడ్కో
- దరఖాస్తుల వడబోత ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అధికారులు
- ఇళ్ల నిర్మాణంపై అనుసరిస్తున్న విధానాలను
- అధ్యయనం చేయడానికి మిగతా రాష్ట్రాలకు వెళ్లనున్న అధికారులు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయిం చింది. ఈ పథకంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికోసం హడ్కో నుంచి రుణం తీసుకుంది. తాజాగా ఈ పథకానికి సంబంధించి రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించడంతో పాటు ఇప్పటికే రూ.1,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికితోడు ఇందిరమ్మ ఇళ్ల అర్జీల పరిశీలనకు అధికారులు కార్యాచరణ సైతం రూపొందించారు.
మరోవైపు ఇండ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను అధికారులు అధ్యయనం చేసి ఈ పథకానికి ఏదీ అనుకూలంగా ఉంటుందో అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.7,740 కోట్లను కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధులను నాలుగు దశల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపింది. ఈ పథకాన్ని ఈ సంవత్సరం మార్చి 11వ తేదీన భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిచడంతో పాటు ఇళ్ల నమూనాలను సైతం ఆయన ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
33,500 ఇళ్లు రిజర్వ్ కోటా కింద
ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని, ఐదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ఇళ్ల కోసం దరఖాస్తులు 82,82,332 లక్షలు రావడంతో వాటిని అధికారులు స్క్రూటీని చేస్తున్నారు. మూడు నెలల్లో స్క్రూటీని పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. మూడు నెలల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఒకే ఇంటి నెంబర్‌తో వచ్చిన అర్జీలను ఇప్పటికే వేరు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. స్క్రూటీని అనంతరం లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తే బాగుంటుందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 33,500 ఇళ్లను రిజర్వ్ కోటా కింద ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రూ.5 వేల కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు….
ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా రుణం ఇవ్వాలని హడ్కో (హౌసింగ్ అండ్ డెవెలంప్‌మెంట్ కార్ప్) నిర్ణయించింది. హౌసింగ్ అధికారులు సుమారు రూ.5 వేల కోట్ల రుణం కోసం హడ్కోకు ప్రతిపాదనలు పంపగా ప్రాథమికంగా రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు హడ్కో అంగీకరించింది. మొదటి దశలో రూ.850 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించింది. అయితే ప్రభుత్వం మరిన్ని నిధులు కావాలని కోరడంతో మొదటివిడతలో రూ. 1000 కోట్ల రుణాన్ని అందించింది. రానున్న రోజుల్లో మరో రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుపై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది.