దేశ రాజధాని పరిసరాల్లో స్వల్ప ప్రకంపనలు
రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.0 గా నమోదు
అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరిక
దేశ రాజధాని న్యూదిల్లీతో పాటు పలు పరిసర ప్రాంతాల్లో సోమవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజాము కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.0 గా నమోదు అయింది. దిల్లీతోపాటు నోయిడా, గురుగాం ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దిల్లీలో స్వల్ప భూప్రంకపనలు వొచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా తెలిపింది.
భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంచం నుంచి కిటికీ వరకు ప్రతిదీ కదలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. ధౌలా కాన్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలేజీ సపంలో 5 కిలోమీటర్ల భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. దిల్లీలో సంభవించిన భూకంపంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ డియా ఎక్స్ వేదికగా స్పందించారు. మళ్లీ భూప్రకంపనలు వొచ్చే అవకాశం ఉందని… అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘దిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. భద్రతా చర్యలు పాటించాలి. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. పరిస్థితులను అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు.