40 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం
దమ్మపేట తాసిల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృత పర్యటన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణాలను ఈ సంక్రాంతి నుంచి ప్రారంభించి పేద ప్రజలకు కానుకగా ఇస్తామని రెవెన్యూ గృహనిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తదితరులు అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా దమ్మపేట మండలం నాచారం, గున్నేపల్లి గ్రామపంచాయతీలకు 40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. దమ్మపేట ఎంపీడీవో కార్యాలయంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మోడల్ హౌస్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్లు ఈ సంక్రాంతి నుంచి ప్రారంభిస్తామన్నారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించామని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభ్యర్థన మేరకు ఈ గిరిజన నియోజకవర్గానికి అదనంగా మరికొన్ని ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అదనపు ఇండ్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థనకు అనుగుణంగా ఇండ్లు కేటాయించి ఏజెన్సీ ప్రాంతానికి లబ్ధి చేకూరుస్తామన్నారు. అలాగే ఈ ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పేద ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో పార్టీలు వర్గాలు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేస్తామన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు
అనంతరం దమ్మపేట తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి ఆ రికార్డుల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన సమాచారం ఇంచార్జ్ ఎమ్మార్వో ని అడిగి తెలుసుకున్నారు. ఆ రికార్డుల ఆధారంగా బాధితులకు ఫోన్ చేసి కార్యాలయంలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. అశ్వారావుపేట మండలం కేశప్పగూడెం, ములకలపల్లి మండలం కొత్తూరు గ్రామాలలో నిర్మించబోయే హై లెవెల్ వంతెనల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ శ్రేణులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.