- ఇప్పటికే బిఆర్‌ఎస్‌ను వీడిన 5 ఎంపిలు
- అదే బాటలో మరికొందరు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీ కీలక నేతలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఎవరు ఊహించని తీరులో బిఆర్‌ఎస్ పార్టీని ఐదుగురు సిట్టింగ్ ఎంపిలు వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఆదివారం బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపి, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు ఉన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏఐసిసి ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వారికి సిఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాగా, ఈ ఉదయమే పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పిన దానం నాగేందర్,రంజిత్ రెడ్డిలు ఒకేసారి బిఆర్‌ఎస్‌కు షాక్ ఇవ్వడం భారీ దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉంటుందని చర్చ జరుగుతోంది. కాగా, గ్రేటర్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్‌కు దానం నాగేందర్ తొలి అధికార పార్టీ ఎమ్మెల్యే కానున్నారు.
ఇంకా బిఆర్‌ఎస్‌కు మిగిలింది 4 ఎంపిలే
లోక్ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపిలు ప్రస్తుతం ఆ పార్టీని వీడారు. మొదటగా జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపిలు బిబి పాటిల్, రాములు బిజెపిలో చేరారు. అనంతరం పెద్దపల్లి, వరంగల్ ఎంపిలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బిఆర్‌ఎస్ కీలక నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బిఆర్‌ఎస్‌కు ప్రస్తుతం నలుగురు ఎంపిలు మాత్రమే ఉన్నారు. మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు బిఆర్‌ఎస్ నేతలు బొంతు రామ్మోహన్, తాటికొండ రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతా రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మాజీ ఎంపి సీతారాం నాయక్, మాజీ ఎంపి జి.నగేశ్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇటీవల బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.