టిఎస్ ఆర్‌టిసికి 5 జాతీయ పురస్కారాలు
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సజ్జనార్‌కు అందజేత
నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ ఆర్‌టియూ ) ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మకమైన అయిదు ఎక్సెలెన్స్ అవార్డులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ ఆర్‌టిసి) గెలుచుకున్న విషయం తెలిసిందే. 2022 -23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టిఎస్ ఆర్‌టిసికి దక్కాయి. న్యూఢిల్లీలోని ఇండియా హబిటెట్ సెంటర్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏఎస్‌ఆర్టీయూ అధ్యక్షులు, కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టిఎస్ ఆర్‌టిసి గెలుపొందిన అయిదు నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్సెలెన్స్ అవార్డులను సంస్థ విసి ఎండి సజ్జనర్ ఐపీఎస్ నేతృత్వంలోని ఆర్‌టిసి అధికారుల బృందానికి ఆయన అందజేశారు. రహదారి భద్రతలో ప్రథమ, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్ విభాగంలో ప్రథమ, అర్బన్ విభాగంలో ద్వితీయ, సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను మరో ప్రథమ పురస్కారాన్ని టిఎస్ ఆర్‌టిసి అధికారుల బృందానికి అందజేశారు. ప్రతిష్టాత్మకమైన అయిదు జాతీయ స్థాయి అవార్డులు దక్కడం సంస్థకు ఎంతో గర్వకారణమని టిఎస్ ఆర్‌టిసి ఎండి సజ్జనర్ అన్నారు. ఈ పురస్కారాలతో
టిఎస్ ఆర్‌టిసి ఖ్యాతి మరింతగా ఇనుమడించిందని చెప్పారు. సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు వరించాయని పేర్కొన్నారు. అవార్డులు వచ్చేలా కృషిచేసిన 43 వేల టిఎస్ ఆర్‌టిసి కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలను అంకితం చేస్తున్నట్లు సజ్జనర్ ప్రకటించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ , ఏఎస్‌ఆర్టీయూ వైస్ ప్రెసిడెంట్ ద్వారక తిరుమల రావు, ఐపీఎస్ , డైరెక్టర్ కిషోర్ , ఈడీ సూర్య కిరణ్ , టిఎస్ ఆర్‌టిసి సిఎంఈ రఘునాథరావు , డిప్యూటి సిపిఎం (అడ్మిన్) శిరీష, డిప్యూటి సిటిఎం (ఐటీ) సమీరా అఫ్రీన్, ఆదిలాబాద్ డిప్యూటీ ఆర్‌ఎం ఎస్.ప్రణీత్, నల్లగొండ డిప్యూటీ ఆర్‌ఎం శివ శంకర్, కొత్తగూడెం డిఎం బివి రావు తదితరులు పాల్గొన్నారు.