మేడ్చల్ జిల్లాలోని షాపూర్ నగర్ లో నక్సలైట్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఉద్దేశపూర్వకంగానే తులసి మొక్క కుండీని ధ్వంసం చేశాడు. మేం నక్సలైట్స్ .. మాకు 50 లక్షల రుపాయలు ఇవ్వాలి, లేకపోతే తులసీ మొక్కను పీకేసినట్టు మీ కొడుకును లేపేస్తామని బెదిరింపు లేఖ అక్కడ పెట్టి వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తులసి మొక్క పీకేసినట్లు మీ కొడుకును చంపేస్తాం..
మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ వచ్చింది. షాపూర్ నగర్ కి చెందిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కూన రవీందర్ గౌడ్ కుమారుడు బిల్డర్, పొలిటిషన్ రాఘవేందర్ గౌడ్ ఇంట్లోకి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించాడు. ఇంటి కాంపౌండ్ లో ఉన్న తులసి మొక్క కుండీని ధ్వంసం చేసి అక్కడ కారుపై ఎర్రటి టవల్ లో ఓ లేఖ పెట్టి వెళ్లిపోయాడు. తమకు రూ.50 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే తులసి మొక్క పీకేసినట్లు మీ కొడుకును చంపేస్తామని లేఖలో రాసినట్లు ఉండటం చూసి ఆయన షాకయ్యారు. మే 21న ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాల్లో పరిశీలించగా ఓ వ్యక్తి ముఖానికి మాస్కు ధరించి వచ్చినట్లు గుర్తించారు. ఆ బెదిరింపు లేఖ గురించి కూన రాఘవేందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు లేఖ తాజాగా వైరల్ అవుతోంది. నగరంలోకి మావోయిస్టులు వచ్చారని, నేరుగా ఇంట్లోకి ప్రవేశించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వారి అడిగిన డబ్బు ఇవ్వపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని షాపూర్ నగర్ ప్రజల్లో భయాందోళన నెలకొంది.