Tuesday, December 24, 2024

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో 60 మంది సర్పంచుల ఆత్మహత్యలు

బిల్లులు చెల్లించక 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని  మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లించకుండా సర్పంచులను రోడ్ల మీదకు తెచ్చిన బీఆర్‌ ఎస్‌ ‌పార్టీ పెద్దలు ఇప్పుడు వారి ముందుండి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు ఎద్దేవా చేశారు. చిన్న చిన్న పనులకు స్థానిక కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని సర్పంచులే స్వయంగా ఆ పనులు చేస్తే అప్పటి ప్రభుత్వ పాలకులు వారిని అప్పుల పాలుచేసి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. సర్పంచులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1300 కోట్లను దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడుకున్న వారే ఇప్పుడు వారి తరపున వకాల్తా పుచ్చుకుని దొంగ సానుభూతి కనబరుస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసునని శ్రీధర్‌ ‌బాబు గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.

ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చి పనులు పూర్తి చేస్తే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం 30 నెలలు పెండింగ్‌లో పెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. ఆ భారం తమ ప్రభుత్వంపై వేసి ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్టుగా గోల చేస్తున్నారని ఆయన విమర్శించారు. పెండింగ్‌ ‌బిల్లులతో వడ్డీలు పెరిగి అప్పులు తీర్చే మార్గం లేక 60 సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడింది నిజం కాదా అని శ్రీధర్‌ ‌బాబు ప్రశ్నించారు. మరో 200 మంది ఆత్మహత్యాయత్నాలు చేస్తే అప్పటి గుడ్డి పాలకుల నుంచి కనీస స్పందన కరువైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ ‌రెడ్డి ఆందోళన చేస్తున్న సర్పంచులకు కాంగ్రెస్‌ ‌పార్టీ తరపును మద్ధతు తెలిపితే రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడ్తున్నారని శోకాలు పెట్టిన చరిత్ర మీది కాదా అని ఆయన బీఆర్‌ఎస్‌ ‌పెద్దలపై ధ్వజమెత్తారు.

ఇంత అవకాశవాదం ఎక్కడా ఉండదని శ్రీధర్‌ ‌బాబు పేర్కొన్నారు. కొంత మంది సర్పంచులు ఇంట్లోని మహిళల బంగారం అమ్మి వడ్డీలు కట్టినట్టు మీడియాలో అనేక వార్తలు వొచ్చాయని శ్రీధర్‌ ‌బాబు పేర్కొన్నారు. సర్పంచ్‌ అం‌టే గ్రామ ప్రథమ పౌరుడు. ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో నిల్చుని గెలిస్తే గులాబీ పార్టీ ఇచ్చిన బహుమతి వారు ఎప్పటికీ మర్చిపోలేనంత దారుణంగా ఉందని ఆయన ఆరోపించారు. సర్పంచులకు రావాల్సిన బకాయిలను చెల్లిస్తామనే చెబుతున్నామని, దశల వారీగా నిధులను విడుదల చేస్తామని వెల్లడించారు. మాజీ సర్పంచులు ఎవరూ రెచ్చగొట్టే వారి మాటలు నమ్మి ధర్నాలు, ఆందోళనలు చేయవద్దని శ్రీధర్‌ ‌బాబు హితవు చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com