Wednesday, July 3, 2024

Elon Musk SpaceX: అంతరిక్ష కేంద్రాన్ని భూమిపైకి తెచ్చేందుకు మస్క్ కు 7వేల కోట్లు

సేస్ ఎక్స్ తో నాసా భారీ ఒప్పందం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అక్కడి నుంచి తొలగించబోతున్నారు.  ఈ మేరకు భాగస్వామ్య దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. 2030 నాటికి ఐఎస్‌ఎస్‌ ను కూల్చివేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసా కసరత్తు మొదలుపెట్టింది. ఐఎస్‌ఎస్‌ ను కూల్చేందుకు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ తో సుమారు 843 మిలియన్‌ డాలర్లు అంటే మన ఇండియా  రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 7 వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని 1998లో మొదలుపెట్టారు.  దశలవారీగా దీన్ని విస్తరించగా.. భూమికి సగటున 400 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్ష్యలో భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 93 నిమిషాలు సమయం పడుతుంది. రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. అగ్ర రాజ్యం అమెరికా, జపాన్‌, రష్యా, ఐరోపా, కెనడా దేశాలు సంయుక్తంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయి. ఆయా దేశాలకు చెందిన చాలా మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి అంరిక్ష కేంద్రంలో కొన్ని నెలల పాటు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం జీవితకాలం 2030 చివరి నాటికి పూర్తవుతుంది. దీంతో భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో భాగంగా ముందు ఫుట్‌ బాల్‌ గ్రౌండ్ పరిమాణంలో ఉండే అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని 2030 మధ్యలో కొంచెం కొంచెంగా కిందకు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్దం చేశారు. మొదటి దశలో ఈ ల్యాబ్ లోని కీలక సామగ్రితో పాటు వ్యోమగాములు భూమి మీదకు వచ్చేస్తారు.

ఆ తరువాత ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ప్రత్యేకంగా రూపొందిస్తున్న యూఎస్‌ డీఆర్బిట్‌ వెహికల్‌ జాగ్రత్తగా భూవాతావరణంలోకి తీసుకొస్తుంది. భూవాతావరణంలో రాగానే అంతరిక్ష కేంద్రం కాలిపోతుంది. దానికి సంబందించిన శకలాలను సముద్రంలో పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular