సమాజంలో ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నా జనం మాత్రం మోల్కోవడం లేదు. ఎక్కడో ఓ చోట మళ్లీ మోసపోతూనే ఉన్నారు. హైదరాబాద్ లో అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు వేలాది మంది. పెట్టుబడికి అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రకటించిన డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ అందరినీ మోసం చేసింది. అశ్వఖ్ రాహిల్ అనే వ్యక్తి 2018 లో మాదాపూర్‌లో డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థను నెలకొల్పాడు. సంస్థలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామని ఎర వేశాడు. సోషల్ మీడియా ద్వార పెద్దఎత్తున ప్రకటనలు ఇవ్వడంతో నమ్మి సుమారు 18 వేల మంది 700 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టారు. మొదట్లో పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి నెల 8 నుంచి 12 శాతం వడ్డీని క్రమంగా చెల్లించడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు.
గడువు తీరాక డబ్బు కోసం వెళ్లిన వారిని ఆ సొమ్ము మళ్లీ పెట్టుబడిగా పెడితే మరింత రాబడి వస్తుందని ముగ్గులోకి లాగారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు దుబాయ్, అమెరికాలో ఉన్న వారూ సైతం పెట్టుబడులు పెట్టారు. జూన్ లో మాదాపూర్ లోని డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ కార్యాలయానికి తాళం వేసి ఉండటం, ఫోన్ లో నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని ఆలస్యంగా గుర్తించారు. ఇక చేసేది లేక మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు సీసీఎస్‌కు వెళ్లాలని సూచించారన్నారు.