Sunday, January 5, 2025

రైతు ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే..

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హామీలను నెరవేర్చాలి
2011 సాగుదారుల చట్టాన్ని  అమలు చేసి కౌలు రైతులను గుర్తించాలి
గత డిసెంబర్ 4న ధర్నా చేపట్టినా కౌలు రైతుల గుర్తింపుకు చర్యల్లేవు..
రైతు, వ్యవసాయ కూలీ సంఘాలను సంప్రదించకుండానే సబ్ కమిటీ నిర్ణయం
సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాల డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవేనని ప్రధాన రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో జనవరి 4న జరగబోయే కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, బి.కొండల్, కన్నెగంటి రవి, పశ్య పద్మ (తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం), ప్రొఫెస‌ర్‌ అరిబండి ప్రసాదరావు (తెలంగాణ రైతు సంఘం), జక్కుల వెంకటయ్య (తెలంగాణ రైతాంగ సమితి), కె.ప్రసాద్(తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం), పి.శంకర్, కల్పన(దళిత బహుజన సంఘం) తదితరులు పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 4న వందలాది మంది కౌలు రైతులు తమ గుర్తింపు కోసం హైదరాబాద్‌లో ధర్నా, బహిరంగ విచారణలో పాల్గొని తమ డిమాండ్లు వినిపించినా, రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం విధాన పరమైన ప్రకటన కూడా చేయలేదన్నారు.

సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల కార్డు, సెప్టెంబర్-23లో రేవంత్‌ రెడ్డి రాసిన ‘కౌలు రైతులకు బహిరంగ లేఖ’ కాపీలను ప్రదర్శిస్తూ, రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతులను ప్రభుత్వం మరోసారి విస్మరించిందని, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలందరికీ మద్దతు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వారికి బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి తేడా ఉండదన్నారు. రైతు భరోసాపై వేసిన కేబినెట్ సబ్-కమిటీ నిర్ణయాలు ఈరోజు మీడియాలో వొచ్చాయని, అయితే సబ్-కమిటీ రాష్ట్ర స్థాయిలో రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయకుండానే నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఐదు ఉమ్మడి జిల్లాలలో సబ్ కమిటీ రైతుల ప్రజాభిప్రాయ సేకరణ చేయడాన్ని తాము స్వాగతించామన్నారు. కానీ ఆ సభల్లో వొచ్చిన అభిప్రాయాలకు అతీతంగానే నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. జిల్లా సభల్లో కౌలు రైతులను కూడా గుర్తించి సహాయం అందజేయాలని అనేకులు అభిప్రాయాలు చెప్పారన్నారు. దాదాపు అందరూ ఎకరాలకు పరిమితి పెట్టి 5 లేదా 10 ఎకరాలకు ఎక్కువ ఉన్న భూ కమతాలకు రైతు భరోసా ఇవ్వకూడదని చెప్పారని, అయినా వీటికి భిన్నంగానే సబ్ కమిటీ సిఫార్సులు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో కౌలు రైతులను గుర్తించి వారికి ఎలా సహకరించాలనే దానిపై వ్యవసాయ మంత్రి సలహాలు కోరారు. రైతు నాయకులు మాట్లాడుతూ ‘కౌలు రైతులను ఎలా గుర్తించాలనే విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చాం అన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో తీసుకొచ్చిన ‘తెలంగాణ భూ అధీకృత సాగుదారుల చట్టం’ ఇప్పటికీ తెలంగాణలో ఉన్నా, ప్రభుత్వం దానిని అమలు చేయట్లేదన్నారు. ఈ చట్టం ప్రకారం, ప్రభుత్వం కౌలుకు తీసుకున్న భూమిని సాగుచేసేవారి నుండి దరఖాస్తులను స్వీకరించి, వారికి రుణం, ఇతర ప్రయోజనాల అర్హత కార్డును జారీ చేయాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే సాగు దారులను ప్రభుత్వం విస్మరిస్తే ఎట్లా? ఈ సీజన్‌లో భూములు సాగు చేస్తున్నామని భూ యజమానుల నుంచి అఫిడవిట్‌లు తీసుకోవడం వంటి ప్రక్రియలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నందున కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టతరం అవుతుందని రైతు నాయకులు అన్నారు. తొలి ఏడాది రైతుల కోసం రికార్డు స్థాయిలో రూ.54,000 కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అందులో 1 శాతం కూడా తెలంగాణలోని 36 శాతం ఉన్న కౌలు రైతులకు దక్కలేదన్నారు.

ముఖ్యమంత్రికి కౌలు రైతుల విషయం గుర్తు చేస్తూ 13 సెప్టెంబర్-23 తాను స్వయంగా కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖలో 22 లక్షల మంది కౌలు రైతులు 40 శాతం భూమిని సాగు చేస్తున్నారని, అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారని నేతలు తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవేనని, కౌలు రైతులకు కార్డులు ఇచ్చేందుకు 2011 చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్‌ దానిని అమలు చేసి వారికి అన్ని పథకాలను వర్తింపజేస్తుందని లేఖలో హామీ ఇచ్చారన్నారు. కౌలు రైతుల విషయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వ్యవసాయ కూలీలకు రూ.12,000 భరోసా విషయం మాట్లాడుతూ, కొన్ని వార్తలలో వచ్చిన విధంగా ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనిని పూర్తి చేసిన వారికే ఇస్తామని నిబంధనలు పెట్టడం అన్యాయమ‌ని, రాష్ట్రంలో ఉపాధి హామీ కార్డులు ఉన్నవారిలో సగటు పని దినాలు కేవలం 45 రోజులు కూడా లభించడంలేద‌ని కేఎస్ఎం నాయకులు అన్నారు. పూర్తిగా భూమిలేని వ్యవసాయ కూలీలకే ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే 1 ఎకరం లోపు భూమి ఉన్న వ్యవసాయ కూలీలందరినీ ఈ పథకానికి అర్హులుగా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com