- పలు జిల్లాలో జెండా పండుగకు హాజరైన
- మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు
రాష్ట్ర వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనేపథ్యంలోనే గోల్కొండ కోటలో సిఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా పలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీ మంత్రులు, విప్‌లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు జాతీయ జెండాను ఎగురవేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎగురవేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో 1,11,818 ఎకరాల నాగార్జునసాగర్ స్థిరీకరణ జరగనుందని భట్టి విక్రమార్క తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం
కరీంనగర్ జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయన ప్రసంగించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో జాతీయ జెండాను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎగురవేశారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఎగరవేశారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను మంత్రి పొన్నం ఎగురవేశారు.
వరంగల్‌లోని ఖిలా వరంగల్ కోటాలో మంత్రి పొంగులేటి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. జనగామ జిల్లాలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ డిసిసి కార్యాలయంలో జాతీయ జెండాను డిసిసి రాజమహేంద్ర నాయక్ ఎగురవేశారు. ములుగు జిల్లాలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో జాతీయ జెండాను మంత్రి ఎగురవేశారు. అనంతరం మంత్రి సీతక్క పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వరంగల్‌లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖిలా వరంగల్ కోటాలో ఖుష్ మహల్ వద్ద జాతీయ పతాకాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని పరేడ్‌గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎగురవేశారు.
నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నర్సిరెడ్డి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి చామల కిరణ్ కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంత్ కె జండగే, డిసిపి రాజేష్ చంద్ర పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగురవేయగా ఈ వేడుకల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా, జాతీయ జెండాను మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరపత్రి అనిల్ ఎగురవేశారు. హనుమకొండ జిల్లాలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరి గాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మువ్వన్నెల జెండాను అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
సచివాలయంలో సిఎస్
హైదరాబాద్‌లోని అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇక హైదరాబాద్‌లోని పలు హెచ్‌ఓడిల్లో ఆయా కమిషనర్‌లు, డైరెక్టర్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు.