Thursday, November 14, 2024

కారు దిగేందుకు మరో 8 మంది ఎమ్మెల్యేలు రెడీ..

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభమయ్యే నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 మంది ఎమ్మెల్యేలు కారు దిగి, కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే చేరికతో బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శాసనసభ్యుల సంఖ్య పదికి చేరింది.

ఏఐసిసి చేరికలకు అనుమతిచ్చిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ఆచితూచి అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలోనే కారు దిగేందుకు 8 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉండగా వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు టిపిసిసి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, మేడ్చల్ మల్కాజిగిరి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు, కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వివేకానంద, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మినహా మిగిలిన వారితో కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

స్థానిక కాంగ్రెస్ నేతల అభ్యంతరాలు
కాంగ్రెస్‌లో చేరడానికి నగరానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పిసిసి వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మిగిలిన వారు సైతం పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎమ్మెల్యేల చేరిక పట్ల పలుచోట్ల స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో కొంత ఆలస్యం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రులు, కీలక నేతలు రంగంలోకి దిగి ఓ వైపు పార్టీలో చేరే వారితో మంతనాలు జరుపుతూనే, తమ పార్టీ నేతలకు నచ్చచెబుతున్నట్టుగా సమాచారం.

అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరగకుండా చూస్తామని టిపిసిసి వారికి హామీ ఇస్తున్నట్టుగా తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఈ చేరికలు మళ్లీ కొనసాగుతాయని, ఈ నెల 24వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి పార్టీలో చేరే ఎమ్మెల్యేల సంఖ్య 15కు దాటే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే బిఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చినట్టైతే బిఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular