•భౌతిక కాయాల వెలికితీతకు తీవ్రంగా కృషి
•సహాయక చర్యల్లో పొరపాట్లు లేవు : మంత్రి జూపల్లి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకు పోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ మేరకు ప్రమాదంపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఉదయం టన్నెల్ ప్రమాద స్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చేరుకుని అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. టన్నెల్‌లో సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపారు. ఆదివారం రాత్రి వరకు నలుగురి ఆచూకీ దొరుకు తుందన్నారు. మిగిలిన వారి ఆచూకీకి మరింత సమయం పడుతుందని తెలిపారు. టన్నెల్ బోరు మిషన్ కట్ చేసి ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రతిపక్షాలు ఘటనపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది చనిపోవడం అత్యంత విచారకరమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. రాడార్ ద్వారా నలుగురి మృతదేహాలు ఒకచోట.. మరో ఇద్దరివి మరోచోట.. మరో ఇద్దరివి మరోచోట గుర్తించారని తెలిపారు. అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని.. ఆదివారం మధ్యా హ్నానికల్లా మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని ఎమ్మెల్యే వంశీ కృష్ణ పేర్కొన్నారు.