నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగి రెండ్రోజులు గడుస్తున్నా.. లోపలే చిక్కుకున్న ఆ 8 మంది జాడ ఇంకా దొరకలేదు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకమేర్పడుతోంది. దీంతో ఆ 8 మంది ఎలా ఉన్నారో అనే ఆందోళన నెలకొంది. టన్నెల్ ప్రమాదం జరిగి 48 గంటలు గడుస్తున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి తదితర బృందాలు విశ్వప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. తాజాగా 8 మందిని కాపాడేందుకు ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సభ్యులు కూడా రంగంలోకి దిగారు.
శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటరు వద్ద సొరంగంలో చిక్కుకున్న బాధితులను కాపాడటం అత్యంత సవాల్‌గా మారింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సొరంగం చివరి భాగంలో పనిచేస్తుండగా.. పైకప్పు కూలిన ఘటనలో సన్నీసింగ్, గురుప్రీత్ సింగ్, జక్తాజస్, సందీప్ సాహు, మనోజ్‌కుమార్, శ్రీనివాస్, సంతోష్ సాహు, అనూజ్ సాహులు టన్నెల్‌లోనే చిక్కుకుపోగా.. వారి జాడ కనిపించకుండా పోయింది. టెన్నెల్ లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం డ్రోన్, స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో వెతికినా ప్రజయనం లేకుండా పోయింది.
టన్నెల్ బోరింగ్ మిషన్ వెళ్లిన రెస్య్యూ టీం.. అక్కడ 500 మీటర్ల మేర బురద నిండి ఉందని గుర్తించింది. దానికి అవతల బాధితులున్నారని భావించి కేకలు వేసినా.. ఎలాంటి సమాధానం రాలేదని ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వెల్లడించారు. ప్రమాదస్థలానికి ముందు 2 కి.మీ మేర నీళ్లు నిలిచి ఉన్నాయని.. నీరు, బురద ఎక్కువగా ఉండటంతో లోపలికి వెళ్లడం చాలా కష్టంగా మారిందని చెబుతున్నారు. టన్నెల్ నుంచి నీటిని తోడాక.. యంత్రాల సహాయంతో బురదను తొలగించాల్సి ఉందన్నారు. సొరంగంలో 13వ కిలోమీటరు నుంచి నీళ్లు ఉండగా.. 13.5 కిలోమీటర్ల నుంచి బురదతో కూడిన నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. లోపల ఉన్న బురదను, అక్కడ 15 అడుగుల మడుగు ఏర్పడగా.. అందులో ఉన్న మట్టి, వ్యర్థాలను తొలగించటం కష్టంగా మారింది. టన్నెల్ బోరింగ్ యంత్రం నడిస్తేనే కన్వేయర్ బెల్టు ద్వారా ఆ వ్యర్థాలు బయటకు పంపే ఛాన్స్ ఉంటంది. అయితే ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ యంత్రం దాదాపుగా ధ్వసం కావటంతో కన్వేయర్ బెల్టును నడపడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చారు.
ఇక సొరంగం లోపల కొనసాగుతోన్న సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోకో ట్రైన్‌లో సొరంగం లోపల దాదాపు 6 గంటలు ఉన్న మంత్రి జూపల్లి.. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సొరంగంలో ప్రస్తుతం నీరు, బురద తోడేసే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని.. రెస్క్యూ టీమ్‌లు టన్నెల్ బోర్ మిషన్‌కు చేరువగా వెళ్లాయన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని చెప్పారు. అయినా కార్మికులను రక్షించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నామన్నారు. లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి శబ్దాలు రావట్లేదన్నారు. కార్మికుల విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదని.. అయినా చివరి వరకు మా ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు.
రంగంలోకి ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ బృందం సభ్యులు
ఈ ఎనిమిది మందిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఘటన జరిగి ఇప్పటికే 48 గంటల కావస్తుండటంటో సొరంగంలోపల చిక్కుకుపోయిన వారిని చేరుకునేందుకు ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ బృందం, నేవీ కమాండోలు, రాష్ట్ర అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, 2023లో ఉత్తరాఖండ్ టెన్నెల్ కూలిన సందర్భంలో బాధితులను కాపాడిన బృందం సభ్యులు తాజాగా రంగంలోకి దిగారు. అప్పటి రెస్క్యూ ఆపరేషన్ బృందంలోని ఆరుగురు సభ్యులు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. అయితే, అక్కడ భారీగా పెరుకుపోయిన నీరు, చెల్లాచెదురుగా పడిపోయిన ఇనుప రాడ్లు, ఇతర పరికరాల కారణంగా లోపలున్న వారిని చేరుకోవడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రబ్బర్ ట్యూబులు, చెక్కల బల్లల సాయంతో బాధితులను చేరుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సొరంగం గోడలకు ఏర్పడిన పగుళ్ల నుంచి నీరు లోపలికి వస్తోందని కూడా సిబ్బంది తెలిపారు. నీటిని బయటకు తోడేసేందుకు అదనపు పరికరాలు అవసరమని పేర్కొన్నారు. సొరంగంపై భాగంలో రాళ్లు కదులుతున్న శబ్దాలు ఇంకా వినిపిస్తుండటంతో అక్కడి పరిస్థితి ఇంకా అస్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రక్షణ చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన సొరంగం లోపలి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి కూడా వాకబు చేశారు. మరోవైపు, సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.