-
నేలకొరిగిన 150 ఏళ్ల మహా వృక్షం-300 సినిమాలకు సాక్ష్యం
-
గోదావరి గట్టుపై పడిపోయిన నిద్రగన్నేరు మహా వృక్షం
ఆ మహా వృక్షానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. సుమారు 150 ఏళ్లుగా ఎన్నో ప్రకృతి విపత్తులను, ఎన్నో వరదలను ప్రత్యక్ష్యంగా చూసిందా చెట్టు. అంతే కాదు కొన్ని వందల సినిమా సన్నివేశాలకు ఆశ్రయమిచ్చిందా మాహా వృక్షం. కానీ చివరికి నేలమట్టమైంది. అవును ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలోని మహా వృక్షం గురించే మీరు వింటున్నది. ప్రకృతి సోయగానికి చిరునామాగా గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున నేలకొరిగింది.
గోదావరి ఒడ్డున 150 ఏళ్లుగా నిట్టనిలువుగా తలెత్తుకుని నిలుచున్న ఈ నిద్రగన్నేరు వృక్షం దగ్గర సుమారు 300 సినిమాలు షూటింగ్ లు జరుపుకున్నాయి. చాలా సినిమాలకు సంబందించిన కీలక సన్నివేశాలు, పాటలను ఈ చెట్టు దగ్గర చిత్రీకరించారు. 1975 లో వచ్చిన పాడి పంటలు సినిమాతో ఈ మహా వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు తదితరుల దర్శకులు తమ సినిమాల్లో ఒక్క సీన్ అయినా ఇక్కడ షూట్ చేసేవారు.
అక్కినేని నాగేశ్వర రావు నుంచి మొదలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి అగ్రహీరోలతో పాటు చాలా సినిమాలను ఈ మహా వృక్షం దగ్గర షూట్ చేశారు. ఇక శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు తదితర సినిమాల్లోని కీలకమైన సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. ప్రకి సంవత్సరం వరదలకు గట్టు కొద్దికొద్దిగా కోతకు గురై చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి నేలకొరిగింది. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన 150 ఏళ్ల భారీ వృక్షం నేరకొరగడం అందరిని కలిచివేస్తోంది.