Thursday, November 7, 2024

బిచ్చగాడి వద్ద అప్పు… తీర్చలేక ఐపీ పెట్టిన వ్యాపారి

69 మందికి ఆ నోటీసులు

“ ఉండటానికి నిలువ నీడ లేదు. తినడానికి పట్టెడు అన్నం లేదు. ఒంట్లో సత్తువలేక బిచ్చగాడిగా మారాడు ఆ ముసలాయన. గుడి దగ్గర యాచన చేస్తూ బతుకు బండిని లాక్కొస్తున్నాడు. అలా యాచించిన సొమ్ములో కొంత మొత్తాన్ని బిడ్డ భవిష్యత్‌ కోసం దాచుకున్నాడు. ఆ డబ్బు తనకిస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపాడు స్థానికంగా ఉండే ఓ వ్యాపారి. తీరా ఇచ్చాక వడ్డీ మాట దేవుడెరుగు, అసలునూ ఇవ్వలేనంటూ ఐపీ పెట్టి ముంచేశాడు. బిచ్చగాడితో పాటు మొత్తం 69 మందిని ఆ వ్యాపారి నిలువునా దోచేశాడు.’’

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్​లో యాచకుడి దగ్గర అప్పు తీసుకున్న ఓ వ్యాపారి ఐపీ పెట్టి పంగనామం పెట్టాడు. ఎన్నో ఏళ్ల నుంచి సాయిబాబా టెంపుల్​ దగ్గర భార్యతో కలిసి గొళ్లల అశోక్‌ అనే యాచకుడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు. ఐతే అధిక వడ్డీ ఆశ చూసి మూడు సంవత్సరాల క్రితం వారు దాచుకున్న రూ.50,000లను అప్పుగా తీసుకున్నాడు స్థానిక హోటల్ వ్యాపారి. అప్పటి నుంచి వడ్డీ ఇవ్వకపోగా, అసలుకే ఎసరు పెట్టాడు. అప్పు తిరిగి ఇవ్వకుండా వృద్ధులనే కనికరం కూడా లేకుండా ముఖం చాటేశాడు ఆ వ్యాపారి.

ఇటీవల యాచకుడు అశోక్‌తో పాటు మొత్తం 69 మంది వ్యక్తులకు ఐపీ నోటీసులు పంపాడు. ఖమ్మంలోని సివిల్ కోర్టులో దివాళా పిటిషన్ అప్లై చేశాడు. మొత్తం రూ.కోటీ 95 లక్షలు అప్పు తీసుకొని, మొత్తంగా 69 మందికి ఐపీ నోటీసులు ఇచ్చాడు. నోటీసులు పొందిన వారిలో యాచకుడు గొళ్లల అశోక్ కూడా ఉండటంతో ఒక్కసారిగా స్థానికులంతా విస్తుపోయారు. ఎన్నో ఏళ్లుగా బిచ్చం ఎత్తుకుని, పైసా పైసా దాచుకొని సంపాదించిన సొమ్మును వ్యాపారి నర్సింహారావును నమ్మి ఇస్తే నట్టేట ముంచాడని యాచకుడు అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డ చదువు కోసం దాచుకున్న డబ్బును వ్యాపారికి అప్పుగా ఇచ్చానని, తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు ఆ యాచకుడు. బెగ్గర్​నే ముంచేసిన వ్యాపారి వ్యవహారం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular