* హైదరాబాద్ నగర విస్తరణకు సకల చర్యలు
* హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే నిర్మాణరంగం విస్తరిస్తుంది
* బిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం
* బిల్డర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
* హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని బాగా విస్తరింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, విస్తరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంలో వెనుకాడే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో బిల్డర్ల తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమావేశమయ్యారు. బిల్డర్స్ సమస్యలను ప్రభుత్వం సానుకూల ధృక్పథంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలి మీతో పంచుకోవాలని కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ్ల బిల్డర్లకు తెలిపారు. హైదరాబాద్ నగరం విస్తరణలో బిల్డర్స్ పాత్ర బలంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటోందని తెలిపారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చేందుకు తాజా బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే వీటిని ఖర్చు చేస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, వరల్ క్లాస్ స్టేడియంలు, స్కిల్ యూనివర్సిటీ వంటి గొప్ప ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలపబోతున్నామని వివరించారు.
రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు బిల్డర్స్ కోరిన విధంగా బ్యాంకర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రధాన ప్రభుత్వ శాఖల ద్వారా బిల్డర్స్ కోరుకున్న విధంగా స్పష్టత ఇప్పిస్తామని బిల్డర్లకు డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగర రాజ్యాంగ విస్తరించింది. ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటలు కాపాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉన్నత లక్షమే తప్ప ఈ ప్రభుత్వానికి మరో ఉద్దేశం లేదని వివరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచితేనే నిర్మాణరంగం పెరుగుతుందని, మూసీ నదిని పునర్జీవింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బలంగా భావిస్తుందని తెలిపారు. అనేక దశాబ్దాలుగా ఉన్న చెరువులు, కుంటలు క్రమంగా కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత మనందరిపైన ఉందని వివరించారు. బిల్డర్స్ సంపద సృష్టికర్తలు. మీ సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉంది. రాష్ట్రంలో నిర్మాణ రంగం ఎదగాలని యావత్ మంత్రి మండలి బలంగా కోరుకుంటుందని తెలిపారు. సమస్యలపై ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటామని బిల్డర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు, మీ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాను అని తెలిపారు. అన్ని అంశాలు ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ నగరం అభివృద్ధికి పదివేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బిల్డర్ల సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఆ ఆలోచన మేరకే బిల్డర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బిల్డర్ లకు సంబంధించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాం.. సరైన రీతిలో స్పందిస్తాం..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని బిల్డర్లకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ యావత్తు ప్రతిరోజు పనిచేస్తుందని తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్, తెలంగాణ క్రెడాయ్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, హైదరాబాద్ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ మాజీ ప్రెసిడెంట్ శేఖర్, నరెడ్కో ప్రెసిడెంట్ విజయ సాయి, తెలంగాణ బిల్డర్స్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.