Sunday, November 24, 2024

రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరియాలి

  • డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకోవాలి
  • విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలిల
  • అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలి
  • అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సిఎం సూచించారు.

శనివారం సాయంత్రం సచివాలయంలో ప్రజాపాలన- విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, సిఎస్ శాంతికుమారి, డిజిపి జితేందర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌లో ఈనెల 19వ తేదీన మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని ముఖ్యమంత్రి అధికారులను అభినందించారు.

డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లిలో యువతతో విజయోత్సవ సభ
ఈనెల 30వ తేదీన మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసే రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. రెండు రోజుల ముందు నుంచే 28వ తేదీ నుంచే రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి అవసరమైన ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు పంటల బీమా, సన్న వడ్లకు బోనస్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా తొలి ఏడాదిలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సిఎం పేర్కొన్నారు. డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే వేదికగా గ్రూప్ 4 తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం…
వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. శాఖల వారీగా రోజుకో మంత్రి తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్ ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు.

ఈ మూడు రోజుల పాటు సచివాలయ పరిసరాలు, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతమంతా ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతీ, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో, కన్నుల పండువలా ఉండే డ్రోన్ షోలను నిర్వహించాలని సిఎం సూచించారు. అన్ని వర్గాలను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు.

డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం
రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలన్నారు. డిసెంబర్ 9వ తేదీన సచివాలయ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారిని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు.

నియోజకవర్గానికో వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు. సచివాలయం, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌పై ఉత్సవాలు జరిగేందుకు వీలుగా వాహనాలను దారి మళ్లీంచాలని సిఎం సూచించారు.

విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సిఎం
సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు. సిఎం వెంట ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెఎస్. శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular