Wednesday, December 25, 2024

Land Acquisition వేట కుక్కల్లా పేదల భూ దోపిడీ

తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న గత ప్రభుత్వ పెద్దలు.. వేటకుక్కలు గా మారి అందినకాడికి దోచుకున్నారని, కాపలా కుక్కలు వేట కుక్కలుగా మారి రాష్ట్రంలో భూ దోపిడీ చేశాయని ఈ దోపిడి పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయిస్తామని రెవెన్యూ హౌసింగ్‌ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో శుక్రవారం భూభారతి 2024 రెవెన్యూచట్టంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘సమాజంలో అట్టడుగు వర్గాలు మొదలుకొని భూ యజమానులకు మేలు చేసే విధంగా విస్తృత స్ధాయిలో ప్రజాభిప్రాయ సేకరణతో రూపొందించిన 2024 భూ భారతి చట్టం అక్షరాలా భూ యజమానులకు చుట్టమని అన్నారు. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014కు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తీసుకువచ్చిన రెవెన్యూ చట్టాలు, సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్‌ ప్రజానీకానికి ఎంతో మేలు చేశాయన్నారు. అదే నిబద్ధత, అదే ఆశ, ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి 2024 రెవెన్యూ చట్టం నిజమైన ప్రజా చట్టం – అక్షరాలా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టమని పేర్కొన్నారు. దేశ రైతు చరిత్రను సరికొత్త సంస్కరణలతో లిఖించిన ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పాలి.

అదృష్టవశాత్తూ ఈ సంస్కరణల త్రయం తెలంగాణ బిడ్డలే కావడం మరో విశేషం. భూకమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి, తెలుగు ప్రధాని పివి నరసింహారావు, కౌలు రైతులకు మేలు చేసే విధంగా రక్షిత కౌలుదారి చట్టం తీసుకువచ్చిన నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, అదేవిధంగా జాగీర్ల రద్దులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మాకు దిశానిర్దేశకులు అని అన్నారు. ఇప్పుడు వారి అడుగుజాడల్లో ప్రజోపయోగమైన ఈనూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. భూమి కోసం, భుక్తికోసం…వేలాది పీడిత రైతులు, కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం…చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం. ఈ ఉద్యమానికి ప్రధానమైన కారణం నిజాం కాలంనాటి భూ సమస్యలే నిజాం సంస్థానంలోని ఉద్యోగులు, జాగీర్ధారులు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌ పాండే లాంటి భూస్వాములంతా…. అధికార దర్పంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. వేలాది పుస్తకాలు చదివిన అపర మేధావిగా….. నయా నిజాంగా పేరు ప్రఖ్యాతులు పొందిన గత ప్రభుత్వ పెద్దలు… ధరణి సృష్టికర్త కూడా ఇదే విధంగా వ్యవహరించారు. ధరణి సమస్యలను పరిష్కరించకలేకపోవడం, క్షేత్రస్ధాయిలో బాధితుల బాధను అర్థం చేసుకోకుండా ధరణిలో ఎలాంటి సమస్యల్లేవంటూ ధరణి సృష్టికర్త బుకాయించారని మంత్రి విమర్శించారు.

రెండు పిల్లుల రొట్టెకథ ఈ ధరణి
మనం చిన్నప్పుడు చదువుకున్న రెండు పిల్లులు రొట్టె కథలాగే ఈ ధరణి ఉందని మంత్రి పొంగులేటి చెప్పారు. రెండు పిల్లలకు నష్టం చేకూర్చిన కోతిలాగే గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ప్రవర్తించి భూములను దోచుకున్నారని ఎద్దేవా చేశారు. . ధరణిలో నా భూమి నేను చూసుకొనే వీల్లేదు. ఆనాడు అంతా రహస్యమే. ఇందిరమ్మ ప్రభుత్వంలో దొరలు, సామాన్యులకు ఒకటే విధానం. భూ భారతిలో అంతా పారదర్శకమే ఆనాటి బ్రిటిష్‌ దొరలు జమీందారులు, భూస్వాముల వంటి దళారులను సృష్టించి శిస్తుల రూపంలో దోపిడీ చేస్తే.. ఈనాటి దొరలు భూముల డిజిటలైజేషన్‌ పేరుతో ధరణిని సృష్టించి భూదోపిడీకి పాల్పడ్డారు. తప్పు ఒకరిది.. శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాలోచితంగా రాత్రికి రాత్రే గడీల మధ్య చట్టం చేసి తప్పుచేసింది ఆదొరవారు. కానీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం అమాయక పేదరైతులు.. ఈ రాష్ట్రంలో ఏ మండలానికి వెళ్లినా , ఏగ్రామానికి వెళ్లినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా మనిషి అనే వాడు ఉన్న ప్రతిచోట ధరణి తెచ్చిన సమస్యలున్నాయన్నారు.

సిద్ధిపేట జిల్లాలో దళితరైతు ప్రాణం తీసిన ధరణి
సిద్ధపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మద్దెల కృష్ణయ్య (73) అనే దళిత రైతు ఇదే గ్రామానికి చెందిన ఎం.విజేందర్‌ రెడ్డి నుంచి 35 ఏళ్ల క్రితం 1452 సర్వే నెంబర్‌లో ఏడెకరాల భూమిని కొనుగోలు చేశారు. ధరణి వొచ్చిన తర్వాత 35 ఏళ్ల క్రితం కొన్నభూమి వేరే వాళ్ల పేరుపై పట్టా కావడంతో మనస్తాపం చెంది 2023, జనవరి 22న మద్దెల కృష్ణ్యయ్య విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అలాంటి పరిస్థితి ఇందిరమ్మ రాజ్యంలో మరొకరికి రాకుండా భూ భారతి చట్టాన్ని రూపొందించాం. ఈ పదేళ్లు తెలంగాణ రాష్ట్రం.. ధ్రుతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకుంది. ఆ పెద్దమనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్ధితి దాపురించింది. మొహం పగిలిపోయేలా ప్రజలు శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తీర్పు ఇచ్చినా బుధ్ది మారడం లేదు. కాంగ్రెస్‌ హయాంలోనే ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రూపొందాయని 1971లో ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం విశేష సేవలందించింది. లక్షలాది మంది భూ హక్కుదారులను 2020 రెవెన్యూ చట్టంతో ఇబ్బంది పెట్టగా నేడు ఇందిరమ్మ రాజ్యంలో భూభారతి పేరిట దేశానికే ఓ రోల్‌ మోడల్‌ గా ఉండే రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టడం నా అదృష్టం అని మంత్రి పొంగులేటి తెలిపారు.

రాష్ట్రంలో గుంట భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసే భూభారతి చట్టాన్ని సభలో ప్రవేశపెడుతుండగా సీనియర్‌లమని చెప్పుకొనే కొంతమంది ఇటు దళిత స్పీకర్‌ పైనా , కాంగ్రెస్‌ సభ్యులపైనా కాగితాలు విసరడం దురదృష్టకరమన్నారు. దీనిపై స్పీకర్‌ తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖ న్యాయకోవిదులు పడాల రామిరెడ్డి భూ సంస్కరణలపై రాసిన పుస్తకం ఎప్పుడూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ టేబుల్‌ పై కనిపించేదని తన సెల్‌ ఫోన్‌లోని ఫోటోను మంత్రి పొంగులేటి ప్రదర్శించారు. పడాల రామిరెడ్డి పుస్తకాల సహకారంతో, 80 వేలకు పైగా పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న కేసీఆర్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి రెవెన్యూ చట్టం వొస్తుందని భావించానని, అయితే లోపభూయిష్టమైన, నాలుగు గోడల నడుమ రూపొందించిన 2020 రెవెన్యూ చట్టం ప్రజా కంటకమైందన్నారు. మూడేళ్లకే ఈ చట్టానికి నూరేళ్లు నిండిపోయాయని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తొలిసారిగా మంత్రి హోదాలో తాను ఇటువంటి గొప్ప బిల్లును ప్రవేశపెడుతుండగా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం సరికాదన్నారు. భూభారతిపై సలహాలు సూచనల కోసం పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టామని, మరోవైపు సీనియర్‌ శాసనసభ్యులు హరీష్‌రావు ఏడు పేజీల సూచనలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ఇటువంటి అత్యంత ప్రాధాన్యత ఉన్న బిల్లును ప్రవేశపెడుతుండగా కేవలం కేటిఆర్‌పై నమోదైన వ్యక్తిగత కేసును తెరపైకి తెచ్చి శాససనభలో గందరగోళం సృష్టించడం ఒక విధంగా రాష్ట్ర ప్రజలను అవమానించడం, వారి ఆశలపై నీళ్లు చల్లడమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

‘‘ భూకమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి, తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు, కౌలు రైతులకు మేలు చేసే విధంగా రక్షిత కౌలుదారి చట్టం తీసుకువొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు, అదేవిధంగా జాగీర్ల రద్దులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి గారు మాకు దిశానిర్దేశకులు అని ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు వారి అడుగుజాడల్లో ప్రజోపయోగమైన ఈనూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చాం.. సమాజంలో అట్టడుగు వర్గాలు మొదలుకొని భూ యజమానులకు మేలు చేసే విధంగా విస్తృత స్ధాయిలో ప్రజాభిప్రాయ సేకరణతో రూపొందించిన 2024 భూ భారతి చట్టం అక్షరాలా భూ యజమానులకు చుట్టం…’’

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com