Friday, September 20, 2024

దోపిడీ దొంగలను నమ్మొద్దు

పదేళ్లలో వాళ్లు ఇచ్చింది ఎంత, పది నెలల్లో మేం ఇచ్చింది ఎంత
అన్న దానిపై చర్చకు సిద్ధమా…
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి
వస్తుందని హరీష్ డ్రామాలు చేస్తున్నారు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు
9 సీట్లు కూడా రావు
సెబీ చైర్‌పర్సన్ అక్రమాలపై విచారణ జరిపించాలి
అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి
సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్

పదేళ్లు మిమ్మల్ని దోచుకుతిన్న ఈ బిఆర్‌ఎస్ దోపిడీ దొంగలను నమ్మొద్దని, పదేళ్లలో వాళ్లు ఇచ్చింది ఎంత, పది నెలల్లో మేం ఇచ్చింది ఎంత అన్నదానిపై చర్చకు సిద్ధమా అని సిఎం రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని హరీష్ డ్రామాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా నమ్ముకున్న మోడీ ఏమయ్యారు, బిఆర్‌ఎస్ వాళ్లు అంతే అయితారని, 400 గెలుస్తామని మోడీ ప్రచారం చేసుకున్నారని, చివరకు ఏమైందో అందరికీ తెలుసని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 39 సీట్లలో 9 సీట్లు కూడా మిగలవని రేవంత్ అన్నారు. సెబీ చైర్‌పర్సన్ అక్రమాలపై విచారణ జరిపించాలని, అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరపాలని సిఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపిసి వేయాలని డిమాండ్ చేస్తూ ఈడీ కార్యాలయం ఎదుట జరిగిన నిరసనల్లో సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నారు
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీలు ఈ నలుగురు కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. దేశ సంపదను అప్పనంగా దోచుకున్న వారిని పక్కాగా జైలుకు పంపే వరకు పోరాడుతామని సిఎం రేవంత్ అన్నారు. అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోడీ పారిపోయారని సిఎం రేవంత్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు అని, ఈ పదకొండేళ్లలో ప్రధాని మోడీ చేసిన అప్పు లక్షా 15వేల కోట్లు అని, ఆ 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోడీ రెండింతలు అప్పులు చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు.

మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీలు దేశాన్ని చెరబట్టారు
అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారని సిఎం రేవంత్ ఆరోపించారు. అదానీ వ్యవహారంపై జేపిసి వేయాలని డిమాండ్ చేశామని, అందుకే అన్ని ఈడీ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలని ఏఐసిసి ఆదేశించిందని సిఎం తెలిపారు. వర్సిటీలు, ప్రాజెక్టులను మొదలుపెట్టిన దార్శనిక ప్రధాని నెహ్రూ అని, ఇందిరాగాంధీ భూసంస్కరణలు ప్రవేశపెట్టి బలహీన వర్గాలకు భూములు పంచారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లే ఐటీ అభివృద్ధి సాధ్యమైందన్నారు. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారని సిఎం రేవంత్ కొనియాడారు. అయితే ప్రస్తుతం దేశాన్ని మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ చెరబట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర పోరాటం కోసం గుజరాత్ నుంచి గాంధీ, వల్లభాయ్ పటేల్‌లు వచ్చారని ఆ ఇద్దరినీ చూసి దేశం గర్విస్తుందని, అదే గుజరాత్ నుంచి మోడీ, అమిత్ షాలు బయలు దేరారని ఈ ఇద్దరు దేశ సంపదను లూటీ చేస్తున్నారన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని అక్రమాలపై విచారణ చేయాల్సిన సెబీ పెద్దలే ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి అతనితో చేతులు కలిపారని సిఎం రేవంత్ ఆరోపించారు. హిండెన్ బర్గ్ అనే సంస్థ అదానీ అక్రమాలపై ఆధారాలు కూడా బయటపెట్టిందని, మోడీ, అదానీ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ప్రజల ఆస్తులు కాజేస్తున్నారని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారని, అలా అడిగినందుకు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారని సిఎం రేవంత్ అన్నారు.

సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తీరుతాం
రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తీరుతామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దానిని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సిఎం హెచ్చరించారు. దీనిని ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వారి వీపులు పగుల్తాయని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నేతలు గత పదేళ్లలో తెలంగాణ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ఆయన మండి పడ్డారు. తల్లి సోనియమ్మ జన్మదినం డిసెంబర్ 9వ తేదీన సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి తామే తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకుంటామని సిఎం రేవంత్ తెలిపారు. ఉద్యోగం ఊడిన తరువాత బిఆర్‌ఎస్ వాళ్లకు తెలంగాణ తల్లిపై ప్రేమ పుట్టుకొచ్చిందని సిఎం రేవంత్ కామెంట్ చేశారు.

రైతు రుణమాఫీపై బిఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ సన్నాసులను నమ్ముకొని రైతులు రోడ్డెక్కొద్దని, ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసమని, మీ సమస్యల పరిష్కారం కోసమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. సెబీ అక్రమాల గురించి కెసిఆర్, కెటిఆర్‌లు ఎందుకు మాట్లాడడడం లేదుసెబీ అక్రమాల గురించి కెసిఆర్, కెటిఆర్‌లు ఎందుకు మాట్లాడడడం లేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని మోడీపై కొట్లాడతామన్న సన్నాసులు ఏమయ్యారని బిఆర్‌ఎస్‌ను ఉద్దేశించి సిఎం రేవంత్ ఫైర్ అయ్యారు. హిండెన్‌బర్గ్ అంశంలో బిఆర్‌ఎస్ విధానం ఏమిటో చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. బిజెపిని సంతోష పెట్టేందుకే శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు రాజీవ్ పేరు తొలగిస్తామంటున్నారని సిఎం రేవంత్ ధ్వజమెత్తారు.

రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాం
ఏ రైతుకు రుణమాఫీ కాకున్నా, కలెక్టర్ కార్యాలయంలో కౌంటర్ పెట్టామని సిఎం రేవంత్ తెలిపారు. రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశామని, కెటిఆర్ ఇకనైనా తప్పుడు మాటలు మానుకోవాలని, తమది ప్రజా పాలన అని, రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉన్నామని ఆయన తెలిపారు. రోజు తాము 18 గంటలు ప్రజల మధ్యనే ఉంటున్నామని, బిఆర్‌ఎస్ నాయకులకు ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కాకుల లెక్క, గద్దల లెక్క పీక్కుతున్నది బిఆర్‌ఎస్ నాయకులేనని సిఎం ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు: మంత్రులు సీతక్క, పొన్నం
కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అదానీ తప్పులపై మాత్రం చర్యలు లేవని, అందుకే ఈడీ ఆఫీసు ఎదుట నిరసన తెలుపుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా దేశ సంపదను కొల్లగొడుతున్నారుని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంట్ కమిటి వేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అదానీ అక్రమాలపై జేపిసి వేస్తే ఇబ్బంది ఏమిటీ? అని ఆయన ప్రశ్నించారు. అదానీ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని లేదంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి పెద్దన్నగా నరేంద్ర మోడీ వ్యవహరించారని ఆయన విమర్శించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అదానీకి అప్పగిస్తున్నారని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే సిబిఐ, ఈడీతో దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

బిఆర్‌ఎస్ బిజెపిలో కలిసిపోయింది: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో బిఆర్‌ఎస్ లేదు, అది ఎప్పుడో బిజెపిలో కలిసిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలన్నారు. దోషులకు చట్టపరంగా శిక్షించాలన్న డిమాండ్‌తోనే ఈ ఆందోళన చేపట్టామన్నారు. మోడీ నల్లధనం తెస్తానని పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని 15 పైసలు కూడా వేయలేదని ఆయన ఆరోపించారు.

సెబీ చైర్మన్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దాం, లేదంటే మోడీ ఈ దేశాన్ని నలుగురి చేతిలో పెట్టి నాశనం చేస్తారని ఒకటయ్యారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సెబీ చైర్మన్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అదానీ ఆస్తులు అక్రమంగా పెంచడంపై న్యాయవిచారణ జరగాలన్నారు. అదానీ వ్యవహారంపై జేపిసితో విచారణ జరిపించాలన్నారు.

అదానీ విషయంలో కేంద్రం ఆత్మపరిశీలన చేసుకోవాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అదానీ గ్రూప్స్ సంస్థల విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అదానీ గ్రూప్‌ను కాపాడుతూ దేశ సంపదనంతా గౌతమ్ అదానీకి అంటగడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ కేంద్రం అవలంభిస్తున్న ఈ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు. సెబీ చైర్మన్ కుటుంబ సభ్యులకే అదానీ గ్రూప్‌లో వాటాలు ఉన్నాయని అటువంటపప్పుడు విచారణాధికారిగా అదే సెబీ చైర్ పర్సన్ ఉంటే ఈ కేసులో న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అందువల్ల రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా కోరినట్లుగా జేపిసి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

గన్‌పార్క్ దగ్గర కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
అదానీ మెగా కుంభకోణం పై దర్యాప్తు జరపాలని కోరుతూ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సెబీ చైర్మన్ అక్రమాలపై విచారణ కొరకు కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు గన్ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఈడీ కార్యాలయం వరకు వెళ్లారు. టిపిసిసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్‌మున్షీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఏఐసిసి సీనియర్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్, ఎంపిలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వివేక్ వెంకట స్వామి, జయవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos