Sunday, April 20, 2025

ఆలోచనలో ఆరు జోన్ల అధికారులు…?

  • ఆలోచనలో ఆరు జోన్ల అధికారులు…?
  • రంగంలోకి హైడ్రా….పర్మిషన్‌లలో లోసుగులు….
  • కొత్త అనుమతుల జారీలో హెచ్‌ఎండిఏ అధికారుల తాత్సారం
  • కొత్త నిబంధనలు తెరపైకి….

హైడ్రా దూకుడుతో హెచ్‌ఎండిఏ అధికారుల్లో కలవరం మొదలయ్యింది. గతంలో హెచ్‌ఎండిఏ ఇచ్చిన అనుమతులకు సైతం హైడ్రా నోటీసులు ఇవ్వడం అధికారుల్లో భయం పట్టుకుంది. దీంతోపాటు బఫర్‌జోన్, శిఖం భూములు, ఎఫ్‌టిఎల్ పరిధిలోని లే ఔట్‌లకు హెచ్‌ఎండిఏ అధికారులు గతంలో అనుమతులు ఇవ్వడంతో వాటిని కూడా కూల్చేయాలని హైడ్రా నిర్ణయించడంతో ప్రస్తుతం కొత్త అనుమతుల విషయంలో హెచ్‌ఎండిఏ అధికారులు ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొత్త అనుమతుల్లో జాప్యం నెలకొంటున్నట్టుగా తెలిసింది. కొన్ని లే ఔట్‌లకు గతంలో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఎన్‌ఓసీల విషయమై ప్రస్తుతం హెచ్‌ఎండిఏ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎండిఏ అధికారులు ఫైనల్ లే ఔట్ అనుమతులకు సంబంధించి మరోసారి ఆ వెంచర్‌ను పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే ఎన్‌ఓసీని జారీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఆ దిశగా హెచ్‌ఎండిఏ అధికారులు ముందుకు పోతున్నట్టుగా సమాచారం. వారంరోజుల క్రితం కొందరు ప్లానింగ్ అధికారులపై కేసు నమోదు చేయాలని హైడ్రా సూచించడంతో ప్రస్తుతం హెచ్‌ఎండిఏలో పనిచేస్తున్న ప్లానింగ్ అధికారులు కొత్త లే ఔట్‌లు, ఆకాశహార్మాల అనుమతులను ఇచ్చే విషయంలో జంకుతున్నట్టుగా తెలిసింది.

ఒక్కో జోన్ పరిధిలో నెలకు 250 నుంచి 300 వరకు దరఖాస్తులు

హెచ్‌ఎండిఏ పరిధిలోని శంకర్‌పల్లి, శంషాబాద్, మేడ్చల్-1, మేడ్చల్-2 ఘట్‌కేసర్ జోన్‌లకు సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఒక్కో జోన్ పరిధిలో నెలకు 250 నుంచి 300 వరకు కొత్త దరఖాస్తులు వస్తుండగా వీటివల్ల హెచ్‌ఎండిఏకు నెలకు దాదాపు రూ.200ల నుంచి రూ.250కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ దరఖాస్తుల్లో బహుళ అంతస్తుల భవనాలతోపాటు, కొత్త వెంచర్లు, లే ఔట్ అనుమతులకు సంబంధించినవే ఉంటాయని ప్లానింగ్ అధికారులు పేర్కొంటున్నారు. పది రోజుల నుంచి ఈ ఫైళ్లను క్లియర్ చేయడంలో అధికారులు తాత్సారం చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అధికారులు ఆయా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి ప్రతి దరఖాస్తుదారు తాము నిర్మించే స్థలానికి సంబంధించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసి) తీసుకు రావాలంటూ ప్లానింగ్ అధికారులు నిబంధనలు పెడుతున్నట్టుగా తెలిసింది. ఆయా స్థలాలు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో లేవని నిర్ధారించి సర్టిఫికెట్లు తీసుకువస్తేనే అనుమతులు ఇస్తామని తాజాగా హెచ్‌ఎండిఏ అధికారులు నిబంధనలు పెడుతున్నట్టుగా తెలిసింది. దీంతో కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ప్లానింగ్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందని ప్లానింగ్ అధికారులు వాపోతుండడం విశేషం.

నాలాలు, చెరువులు, కుంటలను

గతంలో హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తడం, ఏసిబి అధికారులు ఆయన్ను అరెస్టు చేయడంతో అప్పటి నుంచి హెచ్‌ఎండిఏ అధికారుల్లో టెన్షన్ ప్రారంభమయ్యింది. పలుసార్లు ఏసిబి అధికారులు హెచ్‌ఎండిఏలో సోదాలు నిర్వహించడంతో భయపడిన హెచ్‌ఎండిఏ అధికారులు హడావుడిగా అనుమతులు మంజూరు చేయకుండా కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్నారు. ప్రస్తుతం ఆ విషయం కనుమరుగు కావడంతో కొందరు ప్లానింగ్ అధికారులు లే ఔట్‌లతో పాటు భవన నిర్మాణాల అనుమతుల విషయంలో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో నెలక్రితం పిఓలతో పాటు ఏపిఓలను ఆయా జోన్‌ల నుంచి మార్చి వేరే వారికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం హైడ్రా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగడంతో మరోసారి అనుమతుల విషయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన పిఓ, ఏపిఓలు భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగానే పూర్తిస్థాయిలో లే ఔట్ వెంచర్ లేదా నిర్మాణం జరిగే ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్‌కు సంబంధించిన నాలాలు, చెరువులు, కుంటలను చెక్ చేస్తున్నట్టుగా తెలిసింది.

గతంలో నిబంధనలకు విరుద్ధంగా

సాధారణంగా హెచ్‌ఎండిఏ పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు, కొత్త లేఔట్‌లు, వెంచర్లతో పాటు, కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్‌యూజ్ వంటి వాటికి హెచ్‌ఎండిఏ అనుమతులు ఇస్తోంది. కానీ, ప్రస్తుతం గ్రేటర్, ఓఆర్‌ఆర్ పరిధిలో కూడా హైడ్రా అక్రమ నిర్మాణాలపై పెద్దఎత్తున చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయా నిర్మాణాలకు అనుమతిఇచ్చిన అధికారులపై కూడా కేసులు నమోదు చేస్తామని ప్రకటించడం అధికారుల్లో కలకలం రేపుతోంది. పెండింగ్‌లో దరఖాస్తులు ప్రస్తుతం హెచ్‌ఎండిఏ పరిధిలోని ఆరు జోన్ల పరిధిలో కొత్తగా భవన నిర్మాణాలకు, వెంచర్లకు అనుమతులు ఇవ్వాలంటే ప్లానింగ్ అధికారులు ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా ఎక్కడ ఏ నిర్మాణదారుడు నిబంధనలు అతిక్రమించినా తమపై కేసులు పడతాయన్న భయం వారిలో పట్టుకుంది. ఇప్పటివరకు హెచ్‌ఎండిఏ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన వేలాది అనుమతుల్లో కొన్నింటిని ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నా అనుమతులిచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం హైడ్రా రంగంలోకి దిగడంతో పర్మిషన్‌లలో లొసుగులు బయటపడుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com