Wednesday, April 2, 2025

ప్రణీత్​ వెనక ఓ మీడియా సంస్థ

  • ప్రణీత్​ వెనక ఓ మీడియా సంస్థ
  • ఫోన్ల ట్యాపింగ్​తో అందరి మాటలూ విన్నారు
  • వికారాబాద్​ అడవుల్లో సర్వర్లు
  • వరంగల్​లో మరో ఇద్దరు సీఐలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఓ మీడియా సంస్థలోనూ సర్వర్
  • సిరిసిల్ల, వరంగల్​లో స్పెషల్​ సర్వర్లు
  • బయటకు వచ్చిన ఓ మాజీ మంత్రి పేరు

టీఎస్​, న్యూస్​ : ఫోన్ల ట్యాపింగ్​ వ్యవహారంలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తున్నంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వెనకాల ఓ మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశాడని, ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించేందుకు ఆ మీడియా సంస్థ యజమాని దగ్గర సర్వర్ పెట్టినట్లు వెల్లడైంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కోసం వరంగల్ తో పాటు సిరిసిల్లలో వేరు వేరు రెండు సర్వర్లను ప్రణీత్ రావు ఏర్పాటు చేసినట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కీలక నేత ఆదేశాలతో ప్రణీత్ రావు ఆనాటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. త్వరలో ఆ మీడియా సంస్థ అధినేత, అలాగే బీఆర్ఎస్ నేతను ఎస్​ఐబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.

డివైస్​ ధ్వంసం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసి ఎస్ఐబీలోని టాపింగ్ డివైస్ మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ప్రణీత్ విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ డివైస్ పనికిరాకుండా చేసినట్లు తెలుస్తోంది. డివైస్ ని ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టి అడవుల్లో వేసినట్లు విచారణలో అధికారులకు తెలిపారు. అయితే.. ప్రణీత్ చెప్పిన వివరాల ప్రకారం అడవుల్లో పడేసిన డివైస్ ను పోలీస్ అధికారులు వాటిని వెతికేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతనికి సహకరించిన వారందరికీ ప్రమోషన్స్ కల్పిస్తానని ఎర చూపినట్టు తెలుస్తోంది. ఇతనికీ సహకరించినటువంటి 15 మందిలో ఇద్దరు సీఐలు కూడా ఉన్నట్టు తేలింది.

మీడియా సంస్థ ఎండీ దగ్గర సర్వర్​
ప్రణీత్​రావును విచారిస్తున్న ఎస్​ఐబీ పోలీసులకు.. ఈ కేసు సాగుతూను ఉన్నది. ఆయన వెనక ఎవరెవరు ఉన్నారనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కేవలం హైదరాబాద్​ నుంచే కాకుండా.. పలు చోట్ల ప్రత్యేక సర్వర్లను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అయితే, ఓ మీడియా సంస్థ యజమాని ఈ వ్యవహరాల్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొంతమంది నెంబర్లు కూడా ఇచ్చి, వాటిని ట్యాపింగ్​చేసినట్లు విచారణ సందర్భంగా పోలీసుల ముందు చెప్పారు. సదరు మీడియా సంస్థ యజమాని కూడా ఓ మాజీ మంత్రికి సమీప బంధువు.

సిరిసిల్లలోనూ సర్వర్​
ఫోన్​ ట్యాపింగ్​ కోసం రెండు సర్వర్లను సిరిసిల్ల, వరంగల్, హైదరాబాద్ ఏర్పాటు చేశాడు. బీఆర్ఎస్ కీతక నేత ఆదేశంతోనే ఈ వ్యవహారానికి పాల్పడినట్టు వెల్లడవుతున్నది. ఇతనికీ సహకరించిన వారికి కూడా నోటీసులను అందజేసినట్టు సమాచారం. వికారాబాద్ ఫారెస్ట్ లో హార్డ్ డిస్క్ కోసం వెతుకుతున్నారు. హార్డ్ డిస్క్ లభిస్తే.. ఇంకా పూర్తి సమాచారం తెలిసే అవకాశముంది. ఇతని వెనుక ఉన్న బీఆర్ఎస్ కీలక నేత ఎవరు..? మీడియా సంస్థ ఏది అనేది త్వరలోనే వెలుగులోకి రానుంది.

బిగిస్తున్న ఉచ్చు!
అనేక మలుపులు తిరుగుతున్న ఫోన్ల ట్యాపింగ్​ కేసులో పలువురు బీఆర్ఎస్​ నేతలకు ఉచ్చు బిగిస్తున్నట్లుగా మారుతోంది. ఈ వ్యవహారాన్ని తెరవెనుక ఉండి నడిపించిన వారెవరో తేల్చేందుకు పోలీసులు వివిధ రూపాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచిలోని హార్డ్‌డిస్కులను కట్టర్లతో కత్తిరించి వికారాబాద్‌ అడవిలో పడేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకొగా.. అతడ్ని వికారాబాద్ తీసుకెళ్లి ధ్వసం చేసిన హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేసినప్పటికీ.. ఇంటెలిజెన్స్ విభాగంలో అనుభవం ఉండి, ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితోపాటు మరో ఇద్దరితో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ప్రస్తుతం బంజారాహిల్స్ ఠాణాలో విచారణ జరుగుతోంది.

మరో ఇద్దరు సీఐలు..!
ఇదిలా ఉండగా ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వరంగల్ లో అదుపులోకి తీసుకొన్నారు. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నారని అనుమానిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మంగళవారం ఉదయం హైదరాబాదుకు విచారణ నిమిత్తం తరలించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు అధికారులూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో పనిచేశారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో వరంగల్, సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. దీంతో ఎవరెవరిని అరెస్టు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పాత్ర కూడా ఉందనే ప్రచారం జరుగుతుండగా.. ఆయన నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
మరోవైపు, ఈ కేసు నెట్‌వర్క్ ఇప్పుడు కేవలం తెలంగాణ వరకే పరిమితం కాకుండా.. దేశాలు దాటినట్టు బయటపడుతోంది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రణీత్ రావు ప్రైవేట్ వ్యక్తుల కాల్స్ విన్నట్టు బయటపడుతోంది. సాధారణంగా అయితే.. ఎస్‌ఐబీలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం ఉంటుంది. అందుకోసం ఒక లింక్‌ను నోడల్ అధికారి ఎస్‌ఐబీ వారికి ఇస్తాడు. కానీ.. ప్రణీత్ రావు మాత్రం అనధికారికంగా కొన్ని సాఫ్ట్‌వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఐబీలో ఉన్న కొన్ని కంప్యూటర్లలో ఈ మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేసిన ప్రణీత్ అండ్ టీమ్.. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కాల్స్ విన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే కొత్త మాల్వేర్‌లను కంప్యూటర్ల నుంచి తొలగించినట్టు అనుమానిస్తున్నారు. మాల్వేర్ నుంచి విన్న కాల్ రికార్డింగ్స్‌ను హార్డ్ డిస్కు‌, పెన్ డ్రైవ్‌లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్న ప్రణీత్ రావు.. వాటిని ధ్వంసం చేసినట్టుగా విచారణలో తెలిసినట్టు సమాచారం.

ప్రమోషన్స్​ కోసం
ప్రమోషన్లను ఎరగా వేసి ఆరుగురు సభ్యులతో స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌.. వారి ద్వారా వేల సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ ట్యాపింగ్‌ చేసినట్టు విచారణలో తేలింది. ఎస్‌ఐ బీ ఆఫీసులో రెండు రూమ్‌ల్లో 17 కంప్యూటర్లు, హై ఎండ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సహా ట్యాపింగ్‌ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఇలా ఖతర్నాక్‌ సెటప్‌ సెట్‌ చేశారు. ట్యాప్‌ చేసిన కాల్‌డేటాలను ఎప్పటికప్పుడు హార్డ్‌ డిస్క్‌లో సేవ్‌ చేశారు. ఎస్​ఐబీకి గుండెకాయలాంటి లాగర్‌ రూమ్‌ యాక్టివిటీ మొత్తాన్ని తన గుప్పిట్లో తెచ్చుకున్న ప్రణీత్‌రావు తన టీమ్‌ ద్వారా రాజకీయ నేతలు, రియల్టర్లు, వ్యాపార ప్రముఖులతో పాటు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్‌ చేయించాడు. ఇప్పటికే ప్రణీత్‌రావు దగ్గర మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన వాట్సాప్‌ చాట్‌లను రిట్రైవ్‌ చేశారు. ప్రణీత్‌ డైరీలో వరంగల్‌ జిల్లాకు చెందిన నాయకులు సహా మరికొందరి నెంబర్లు వున్నాయి. వాళ్లు పంపిన ఫోన్‌ నెంబర్లను ప్రణీత్‌ అండ్‌ టీమ్‌ ట్యాప్‌ చేసినట్టు ఎంక్వయిరీలో ట్యాలీ కావడంతో రాజకీయ లింకులపై మరింత ఫోకస్‌ పెట్టారు.

అసలేం జరిగింది..
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించి, విచారణ చేపట్టారు. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com