జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ ఘటన గురువారం రాత్రి సరిహద్దు వెంట పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో జరిగింది. జవాన్ వీర మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయక్‌కు నివాళులర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
“దేశ రక్షణలో శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని సీఎం చంద్రబాబు పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.