Friday, September 20, 2024

ఇక ఇసుక సమస్యలకు శాశ్వత పరిష్కారం 

* ఇక ఇసుక సమస్యలకు శాశ్వత పరిష్కారం 
* గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
* నేడు “ఆంధ్రప్రదేశ్ ఇసుక నిర్వహణ విధానం” నూతన పోర్టల్ ఆవిష్కరించనున్న సిఎం
* అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేస్తూ అందరికీ అందుబాటులో ఇసుక
* రాష్ట్ర మంతటా ఏకీకృత రవాణా చార్జీలు 
* సచివాలయాలలో ఇసుక బుకింగ్ పూర్తి చేసుకునే సువర్ణావకాశం 
* కీలక భూమిక పోషించనున్న జిల్లా స్దాయి కమిటీలు  
ఉచిత ఇసుక విధానం పూర్తి స్దాయిలో గాడిలో పడనుంది. ఇసుక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఆంధ్రప్రదేశ్ ఇసుక నిర్వహణ విధానం (ఎపి శాండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్) ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు గురువారం ఆవిష్కరించనున్నారు. క్షేత్ర స్దాయిలో అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుకను చేర్చాలన్న చంద్రబాబు నాయిడు ఆలోచనలకు అనుగుణంగా గనులు, భూగర్బ శాఖ అందరికీ అందుబాటులో, అనుకూలమైన విధానానికి రూపకల్పన చేసింది. ఫలితంగా ఇకపై ఇసుక ఎగుమతి కోసం బారులు తీరే లారీలు, దిగుమతి కోసం వేచిచూసే వినియోగదారులు కనిపించరు.
గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా నూతన పోర్టల్ గురించి వివరిస్తూ  ప్రభుత్వం ప్రజలకు పూర్తి ఉచితంగానే ఇసుకను అందిస్తుందని, కేవలం నిర్వహణ, జిఎస్ టి, సీనరేజ్ వంటి చార్జీలను మాత్రమే వసూలు చేస్తారని, దీనిలో ప్రభుత్వానికి ఎటువంటి విక్రయ అదాయం లేదని వివరించారు. పారదర్శకతతో కూడిన విధానం అమలు చేస్తున్నామని, శాండ్ పోర్టల్ ను నిశితంగా పరిశీలిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని తెలిపారు. వినియోగదారులు ఇసుక బుకింగ్ కోసం ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదని, వారి గ్రామ, వార్డు సచివాలయాలలో చేయించుకోవచ్చని వివరించారు. ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు కేవలం సచివాలయాల ద్వారా మాత్రమే బుకింగ్ జరుగుతుందని, 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైన, ఎక్కడినుండైనా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పోర్టల్ కోరిన విధంగా అవసరమైన డాక్యుమెంట్లు పొందుపరచాలన్నారు. అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలు, రవాణా సామర్ధ్యాలను అనుసరించి రోజువారి బుకింగ్ పై నియంత్రణ  ఉంటుందని మీనా తెలిపారు.
నూతన ఇసుక పోర్టల్ వల్ల వివిధ దశలలో అనుక్షణం నిఘా ఉంటుందని, అధికారుల మొదలు రవాణా దారుల వరకు ఏఒక్కరూ తప్పు చేయలేని విధంగా దీనిని రూపొందించామని తెలిపారు. అయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్ధాయి కమిటీలు స్దానిక వ్యవస్ధలను నియంత్రిస్తాయని తెలిపారు. పోర్టల్ లో జిల్లాల వారిగా సప్లయ్ పాయింట్ లు, రవాణ చార్జీలు, ఆరోజుకు అందుబాటులో ఉన్న ఇసుక వంటి వివరాలను చూపుతుందన్నారు.  లారీల యజమానులు, మధ్యవర్తులు పేరిట వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రిటానికి పోర్టల్ మార్గం చూపుతుందన్నారు. రవాణా కోసం లారీలను ఎంపానల్ చేస్తున్నామని, వాటికి జిపిఎస్ విధానం కూడా అనుసంధానం చేయటం ద్వారా లారీ నిర్దేశిత ప్రాంతానికే చేరుతుందా లేక మరో మార్గంలో వెళుతుందా అన్న సమాచారం కూడా తెలుస్తుందన్నారు. రిజిస్టర్డ్, వెరిఫై చేయబడిన వాహనాలు మాత్రమే రవాణా కోసం ఉపయోగించుకుంటూ, బుకింగ్ సమయంలోనే లారీ ఎప్పుడు లోడింగ్ పాయింట్ కు చేరాలి, ఎప్పటికీ వినియోగదారునికి చేరుతుంది అన్న విషయం కూడా చెప్పటం జరగుతుందన్నారు. రవాణా చార్జీల పరంగా రాష్ట్ర మంతటా ఏకీకృత రవాణా చార్జీలు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నైనా  కిలోమీటర్ల ప్రాతిపదికన స్దిర చార్జీలు అమలవుతాయన్నారు.
ఉచిత ఇసుక విషయంలో ప్రజలు ఎదుర్కునే ఇబ్బందులను టోల్-ఫ్రీ నంబర్ 1800-599-4599, ఇమెయిల్-ఐడి: dmgapsandcomplaints@yahoo.com., ద్వారా కాని ఫిర్యాదు చేయవచ్చని, ప్రతి ఫిర్యాధు పైనా తప్పని సరిగా చర్య తీసుకుని, సంబంధిత వ్యక్తులకు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల నుండి తిరిగి సమాచారం అందిస్తారని అన్నారు. ఉచిత ఇసుక  ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని,  ఐవిఆర్ఎస్ విధానం ద్వారా ప్రతి రోజు వినియోగదారుల నుండి అభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. విజిలెన్స్ మెకానిజంను పటిష్టం చేస్తున్నామని కఠిన చర్యలకు సైతం వెనకాడబోమన్నారు. అన్ని రకాల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ పోలీసు యంత్రాంగం నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసామని, పటిష్టంగా చెక్ పోస్టులను నిర్వహిస్తామని తెలిపారు. ఇసుక కొరత లేకుండా స్టాక్‌యార్డ్ లలో లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుకకు సంబంధించిన రోజువారి కార్యకలాపాలు, నమోదైన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై సవివరమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలా అదేశాలు జారీ చేసామన్నారు.
సాధారణ బుకింగ్ పరిదిలోకి 2000 చదరపు అడుగుల నివాసాలు : గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్
ఇసుక బుకింగ్ ను రెండు రకాలుగా నిర్దేశించామని గనుల శాఖ సంచాలకులు, ఖనిజాభివృద్ది సంస్ధ ఎండి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సాధారణ బుకింగ్ ఒకటి కాగా, బల్క్ బుకింగ్ రెండవదిగా ఉందన్నారు. 2000 చదరపు అడుగుల లోపు నిర్మితమయ్యే భవనాల యజమానులు సాధారణ బుకింగ్ పరిధిలోకి వస్తారని, మిగిలిన వారంతా బల్క్ బుకింగ్ చేసుకోవలసి ఉంటుందన్నారు. బల్క్ బుకింగ్ రెండు రకాలుగా ఉంటుందని అయా ప్రభుత్వ శాఖల చేసుకునే విధానం ఒకటికాగా. బహుళ అంతస్తుల నిర్మాతలు రెండో విధానం క్రిందకు వస్తారని ప్రవీణ్ కుమార్ వివరించారు. ఇసుక సరఫరా కు సంబంధించి మూడో పార్టీ తనిఖీకి పెద్ద పీట వేస్తున్నామని, ప్రతి అంశాన్ని మూడో పార్టీ ఎప్పటి కప్పుడు నిశితంగా గమనిస్తూనే ఉంటుందన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos