ప్రముఖ అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తమిళనాడు ప్రభుత్వం గౌరవాన్ని కల్పించే నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని ఓ రోడ్డుకు ఆయన పేరు పెట్టింది. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ కి ఎస్పీ చరణ్ చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయనకి ఆ రోడ్డు తో ఉన్న అనుబంధం కారణంగా పేరు పెట్టడం ఆయనకి ఇచ్చే గౌరవం అవుతుందని సీఎం కి విజ్ఞప్తి చేశారు. ఎస్పీ బాలు గారి వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. చెన్నై నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
దీంతో ఇక నుంచి చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డు ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవాలని సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఒక గాయకుడికి ఇలాంటి గౌరవం దక్కడం గొప్ప విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భాషతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ను దక్కించుకున్నారు. అలాంటి గాయకుడికి దక్కిన ఈ గౌరవానికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన బాలు ఇంజనీరింగ్ చదివినప్పటికీ సంగీతం పట్ల ఆసక్తి, అభిరుచితో సింగర్ గా కెరీర్ ను ప్రారంభించారు.
ప్రముఖ సంగీత దర్శకులు ఎస్ పి కోదండపాణి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్న ఎస్పీ బాలు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పాడిన పాటలకి గాను దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయి అవార్డులను, గుర్తింపులను బాలు దక్కించుకున్నారు. నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు 50 వేల పాటలను పాడినిందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సైతం సొంతం చేసుకున్నారు. ఆయన 2020లో కరోనాతో మృతి చెందారు. కరోనా మహమ్మారి తీసుకెళ్లిపోయిన గొప్ప వారిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు అంటూ ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ప్రతి రోజూ ఆయన పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.