Sunday, November 17, 2024

నటి జత్వానీ వ్యవహారంలో సంచలన పరిణామం

ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

ముంబయి నటి కాదంబరీ జత్వానీ వ్యవహారంలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్‌ అధికారి విశాల్‌గున్నిను సస్పెన్షన్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు ఇచ్చింది. ముంబయి నటి కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. అదే విధంగా విజయవాడలో పని చేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను సస్పెండ్‌ చేశారు.

తాజాగా ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్‌లు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీలపై చర్యలు తీసుకున్నారు. 2024 ఫిబ్రవరి రెండో తేదీన ఉదయం 6:30 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విశాల్ గున్ని బృందం డీజీపీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ముంబైకి వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఏడున్నర గంటలకి ముంబై వెళ్లే విమానం ఎక్కినట్టు విచారణలో వెల్లడైంది. సినీనటి జత్వానీ అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని డీజీపీకి సమాచారం ఇవ్వకుండా ఉండటంపైనా అభియోగాలు నమోదు అయ్యాయి.

అదే సమయంలో ఎఫ్ఐఆర్ నమోదైన కొన్ని గంటల్లోనే ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు లేకుండానే అరెస్టు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడంపైనా అభియోగాలు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, విజయవాడ డీసీపీ విశాల్ గున్నిలు ఒకే రకంగా వ్యవహరించినట్టు అధికారులు గుర్తించారు.

వారిపై కేసులు నమోదు చేయాలనే ఫిర్యాదుతోనే..!
ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌గున్ని, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌లపై కేసు నమోదు చేయాలని ముంబయి నటి ఫిర్యాదు చేశారు. శుక్రవారం, శనివారం వరుసగా రెండు రోజుల పాటు తన న్యాయవాదులు పీవీజీ ఉమేష్‌ చంద్ర, పాల్‌తో కలసి ఆమె విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు వెళ్లారు. సీఐ చంద్రశేఖర్‌కు పలు వివరాలు ఇచ్చి, ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. ముంబయి నటి ఫిర్యాదు మేరకు కుక్కల విద్యాసాగర్‌, మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే నటి కాదంబరీ జెత్వానికి వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా వేటు పడింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 1590, 1591,1592 విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని వెబ్‌సైట్‌లో ప్రభుత్వం పేర్కొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular