Wednesday, November 13, 2024

సింగరేణి బొగ్గు వినియోగదారులతో సమన్వయానికి ప్రత్యేక సెల్

  • ఇతర కంపెనీతో పోలిస్తే సింగరేణి లో వినియోగదారులకు ఎన్నో వెసులుబాట్లు
  • వాళ్ళు వినియోగదారులు కాదు-మా ప్రగతి భాగస్వామ్యులు
  • వినియోగదారుల సూచనలపై తక్షణ చర్యలు
  • సింగరేణిలో వినియోగదారులకు వెసులుబాట్లు అనేకం
  • ఈ-వేలం వినియోగదారులతో సింగరేణి సిఎండి ఎన్.బలరామ్

రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న అనేక పరిశ్రమలకు బొగ్గునందిస్తున్న సింగరేణి సంస్థ తన వినియోగదారులపట్ల స్నేహపూరితంగా వ్యవహరిస్తుందని, వారిని వినియోగదారులుగా కాకుండా ప్రగతి భాగస్వాములుగా గుర్తిస్తోందని, వారి సౌకర్యం కోసం ఒక ప్రత్యేక సమన్వయ సెల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండి ఎన్.బలరామ్ పేర్కొన్నారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్ లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ-వేలం (ఈ ఆక్షన్) వినియోగదారులు, వ్యాపారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సింగరేణి బొగ్గుని వినియోగిస్తున్న సుమారు 80 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ తరపున కొన్ని సూచనలు చేయగా దీనిపై వెంటనే స్పందించిన సంస్థ ఛైర్మన్ బొగ్గు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సమాచార లోపం లేకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయనున్నామని, దానిలో తాను కూడా ఉంటాను కనుక ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

దీనిపై వినియోగదారులు తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ అండ్ ఎండి ఎన్.బలరామ్ మాట్లాడుతూ దేశంలోని ఏ ఇతర బొగ్గు సంస్థల్లో లేనివిధంగా సింగరేణిలో ఈ-వేలం వినియోగదారులకు అనేక వెసులుబాట్లను కల్పించామన్నారు. కోల్ ఇండియాలో ఈ-వేలం సేల్ ఆర్డర్ కాలపరిమితి కేవలం 45 రోజులు ఉండగా సింగరేణిలో ఇది 90 రోజులుగా ఉందని పేర్కొన్నారు. ఎవరైనా వినియోగదారులు ఈ కాల పరిమితిని ఇంకా పెంచమని సమంజసమైన కారణం చూపితే వారికి మరో 90 రోజుల పాటు సేల్ ఆర్డర్ కాల పరిమితిని పెంచే వెసులుబాటును కలిగిస్తున్నామన్నారు. ఈ సౌకర్యం కోల్ ఇండియాలో లేదని తెలిపారు. ఇతర బొగ్గు కంపెనీలలో ఈ-వేలం తర్వాత పూర్తి సొమ్ము చెల్లించడానికి కేవలం 13 రోజుల కాలపరిమితి మాత్రమే ఉండగా సింగరేణిలో దీనిని 27 రోజుల పనిదినాల కాలపరిమితిగా నిర్ణయించామన్నారు. ఎవరైనా ఈ-వేలం వినియోదారుడు బొగ్గు తీసుకుంటున్న క్రమంలో సేల్ ఆర్డర్ ను రద్దు చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు రద్దు ప్రక్రియకు అంగీకరించటమే కాక వెంటనే సంబంధిత బొగ్గు డిపాజిట్ ను వెనక్కి చెల్లించడం జరుగుతుందన్నారు.

ఇతర కంపెనీలలో విద్యుత్తేతర వినియోగదారులకు రిజర్వ్ ప్రైస్ 20శాతం ఉండగా సింగరేణిలో ఇది కేవలం 5శాతం మాత్రమేనని, ఇది వినియోగదారులకు ఎంతో వెసులుబాటు కలిగించే విషయమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సింగరేణి సంస్థలో ఎస్.ఏ.పి ద్వారా పూర్తి కంపుటరైజేషన్ తో వినియోగదారులకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు నిర్వహిస్తున్నామని, వినియోగదారులు తమ ఇంటి వద్ద నుండే సేల్ ఆర్డర్ లు పొందడం, సొమ్ము చెల్లించడం, బొగ్గు పొందటం వంటివి చాలా సులువుగా సింగిల్ విండో పద్ధతిలో చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇన్ని విధాలుగా సింగరేణి సంస్థ వినియోగదారులతో స్నేహపూరిత వ్యాపార బంధం కలిగి ఉన్న నేపథ్యంలో దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ తాను ఏటా ఉత్పత్తి చేస్తున్న 700లక్షల టన్నుల బొగ్గులో ఎక్కువ శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తుందని, మిగిలిన దానిలో ప్రధానంగా సిమెంటు, స్పాంజ్ ఐరన్, ఎరువులు, మందులు, పేపర్, సిరమిక్స్ వంటి కర్మాగారాలకు సరఫరా చేస్తూ ఆ కంపెనీల అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి పాటుపడుతుందన్నారు.

కేంద్ర బొగ్గు శాఖ ఆదేశం ప్రకారం ఈ-వేలం ప్రక్రియనీ 2007లో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 408 లక్షల టన్నుల బొగ్గును విక్రయించాలని ఇటీవల కాలంలో ఏడాదికి సగటున 25 లక్షల టన్నుల బొగ్గును ఈ-వేలం ద్వారా వినియోగదారులకు, ట్రేడర్లకు అమ్మడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ వినియోగదారులకు నాణ్యమైన బొగ్గుని సకాలంలో అందజేస్తుందని హామీ ఇచ్చారు. సంస్థ ఛైర్మన్ తొలిసారిగా తమతో సమీక్షించడం, నిరంతర సమాచారం కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల ఈ-వేలం ప్రతినిధులు తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంస్థ ఛైర్మన్, ఎండి ఎన్.బలరామ్ తో పాటు జనరల్ మేనేజర్ మార్కెటింగ్ జి.దేవేందర్, అడిషనల్ జనరల్ మేనేజర్ ఎన్.వి. రాజశేఖర్ రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ రవివాస్తవ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular