- మన్మోహన్‌కు నివాళి కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు
- స్కిల్ యూనివర్సిటీకి పివి పేరు పెట్టాలని డిమాండ్
దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్ రాజ్, పర్మిషన్ రాజ్, కోటా రాజ్ విధానాలకు మన్మోహన్ స్వస్తి పలికారని తెలిపారు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సభ నివాళులర్పించింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినట్లు వార్తలొచ్చాయి. కానీ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ జీవితం దేశ సేవలో ధన్యమైందని చెప్పారు. ఆయన సేవలను గుర్తుంచుకునేలా ప్రభుత్వాలు ఏం చేసినా బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడిరచారు.
పీవీ ఖ్యాతిని చాటేలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని, స్కిల్ వర్సిటీకి నరసింహారావు పేరు పెట్టాలని ప్రతిపాదించారు. భారత రత్నకు మన్మోహన్ సింగ్ 100 శాతం అర్హులేనని చెప్పారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని బీఆర్‌ఎస్ కోరుతున్నదని తెలిపారు. గతంలో పీవీకి భారత రత్న ఇవ్వాలని బీఆర్‌ఎస్ తీర్మానించిందని, దానికి అనుగుణంగా కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చిందని గుర్తుచేశారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు పీవీ-మన్మోహన్ ద్వయం కృషి చేసిందని వెల్లడిరచారు.
1996లో కాంగ్రెస్ ఓటమికి ఆర్థిక సంస్కరణలూ కారణమని ఓ కమిటీ నివేదిక ఇచ్చిందని, దానిని చూసిన మన్మోహన్ సింగ్ కంటతడి పెట్టారని పేర్కొన్నారు. మన్మోహన్ భౌతికంగా లేకున్నా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ఉంటాయన్నారు. విదేశాల్లోనూ ఆయనకు ఉన్నత ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. వాటికంటే దేశమే ముఖ్యమని చాటిన గొప్ప వ్యక్తి మన్మోహన్ అని చెప్పారు.ఆయన ఎప్పుడూ పదవుల కోసం చూడలేదని, పదవులే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. మన్మోహన్ సంతాప తీర్మానాన్ని మండలిలోనూ పెట్టి ఉంటే బాగుండేదని చెప్పారు.