హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ ప్రాంతంలోని గుడ్ డే బార్‌లో ఆదివారం రాత్రి జరిగిన తాగుబోతుల గొడవ విషాదాంతానికి దారి తీసింది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు పరస్పరం వాగ్వాదానికి దిగగా, వారు చల్లబరచేందుకు ప్రయత్నించిన మరో యువకుడిని హత్య చేశారు. బాధితుడు పవన్ కుమార్ (25) గుండెచప్పుడు ఆగేలా కొడతారనుకోకనే మద్య మత్తులో ఉన్నవారిని శాంతింపజేయబోయాడు. అయితే అదే అతని జీవితాన్ని ముగించింది.
ఫుల్‌గా తాగిన మైకంలో
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శ్రవణ్ అనే వ్యక్తి తన మిత్రుడు హరితో తీవ్రంగా వాదించుకుంటున్న సమయంలో పవన్ కుమార్ మద్యవర్తిగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చాడు. కానీ శ్రవణ్ మద్యం మత్తులో ఉండటంతో ఆపదను గుర్తించలేకపోయాడు. చేతిలో ఉన్న బీరు బాటిల్‌తో పవన్ కుమార్‌ను శ్రవణ్ గొంతు భాగంలో కొట్టాడు. బాటిల్ తాకిన వెంటనే తీవ్ర గాయాలవ్వడంతో పవన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విచారణలో పవన్ కుమార్, శ్రవణ్, హరి ముగ్గురూ పటేల్ నగర్‌కు చెందినవారని, ఒకే పరిచయ వర్గానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనకు కారణమైన వాదన ఎలాంటి పాత కక్షల ఆధారంగా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. బార్‌లో ఈ విధంగా జరిగిన హత్య స్థానికుల్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది.ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితులు శ్రవణ్, హరి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.