ఎట్టకేలకు కెటిఆర్ మెడకు ఈ కార్ రేసింగ్ అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. దీనిపై అసె ంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేసిన కెటిఆర్‌పై కేసు నమోదు అయ్యింది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్ర మించింది.
అందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సి ందిగా అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి మంగళవారం లేఖ రాశారు. ఫార్ములా రేసు పూర్వపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్‌తోపాటు పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్ ఇంజినీర్‌ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా, సుమారు నెల రోజుల తర్వాత ఇటీవల అనుమతి లభించింది. దీంతో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది.
ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్టస్ జెన్, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు. ‘అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంవోయూ చేశా‘ అని ఒప్పందంపై ఐఏఎస్ అర్వింద్ కుమార్ సీఎస్‌కు సమాధానమిచ్చారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. వీటన్నింటిపైనా అనిశా దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి, వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా…? అనే అంశంపై ఎసిబి ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన రూ.55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే అవకాశముంది. ఫార్ములా-ఈ రేస్ నిర్వహించిన సంస్థలకు సైతం నోటీసులు జారీ చేయడానికి అవకాశముంది.
ఆధారాలు లభిస్తే అరెస్టు తప్పదు..!
అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే… అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. అదే జరిగితే మున్ముందు ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారం సంచలనాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు. 2023, ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు రూ.55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. అయితే రూ.55 కోట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగాయని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు సర్కార్ ఆదేశించింది. ఆర్థికశాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్ లో లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకండా ఏ విధంగా అప్పగించారని దానిపై స్పష్టత లేకుండాపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.