* పిఓలు, ఏపిఓలను విచారించిన అధికారులు
* బివి కృష్ణ కుమార్ అనుమతి ఇచ్చిన ఫైళ్లు, టిడిఆర్‌ల విషయమై ఆరా
* మరో ఇద్దరు ప్లానింగ్ అధికారుల పాత్రపై లోతుగా విచారణ
హెచ్‌ఎండిఏ కార్యాలయంలో గురువారం ఏసిబి అధికారులు సోదాలు జరిపారు. శంకర్‌పల్లి జోన్‌లో టిడిఆర్‌ల విషయంలో రియల్టర్‌లు అనుకూలంగా పనిచేయడంతో పాటు అప్పటి హెచ్‌ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా మెలిగిన శంకర్‌పల్లి జోన్ ఏపిఓ (అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి) బివి కృష్ణ కుమార్ చాంబర్‌లో ఏసిబి అధికారులు సోదాలు చేశారు. బుధవారం బివి కృష్ణ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి హెచ్‌ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణతో కలిసి బివి కృష్ణ కుమార్ లేఔట్ల అనుమతులతో పాటు బిల్డింగ్ నిర్మాణాల్లోనూ అవినీతి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన చాంబర్‌ను ఏసిబి అధికారులు గురువారం తనిఖీ చేశారు. దీంతోపాటు పలువురు పిఓలను, ఏపిఓలను బివి కృష్ణ కుమార్ గురించి అడిగి తెలుసుకున్నారు. బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా బివి కృష్ణ కుమార్‌ఫైల్స్ క్లియర్ చేసినట్టు ఏసిబి అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ వల్ల ప్రభుత్వానికి దాదాపు వందల కోట్ల నష్టం జరిగిందని ఏసిబి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో మరో ఇద్దరు హెచ్‌ఎండిఏ ప్లానింగ్ అధికారుల పాత్రపై కూడా ఏసిబి ఆరా తీస్తోంది.
* బడా బిల్డర్ల ప్రాజెక్టుల ప్లానింగులో టిడిఆర్ విలువ తగ్గించి తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వానికి నష్టం కలిగించినట్టు ఏసిబి గుర్తించింది. ఫైల్స్‌కు అనుమతినిచ్చిన కృష్ణ కుమార్‌తో పాటు మరో ఇద్దరు హెచ్‌ఎండిఏ ప్లానింగ్ ఆఫీసర్ల గురించి ఏసిబి అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ, కృష్ణ కుమార్ మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ల సిండికేట్‌పై ఏసిబి దృష్టి సారించినట్టుగా సమాచారం. అందులో భాగంగా వారు అనుమతిచ్చిన ఫైల్స్‌తో పాటు టిడిఆర్ నష్టాలపై గురువారం ఏసిబి అధికారులు ఆరా తీసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఏపిఓ బివి కృష్ణ కుమార్ రెండు నెలల క్రితం సెలవుపై అమెరికాకు వెళ్లారు. హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు కాగానే బివి కృష్ణ కుమార్ పాల్పడిన అవినీతి గురించి ఏసిబికి ఫిర్యాదులు అందడంతో ఆయన వెంటనే అమెరికాకు వెళ్లిపోయారు. ప్రస్తుతం బివి కృష్ణ కుమార్‌ను అమెరికా నుంచి రప్పించడానికి ఏసిబి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టిడిఆర్ కేసు మరింత మంది హెచ్‌ఎండిఏ ఉద్యోగులకు చుట్టుకునే అవకాశం ఉందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.